- వయోవృద్ధుల అనుభవాలు భావితరాలకు అందించాలని పిలుపు
గ్రేటర్ వరంగల్, వెలుగు: వయోవృద్ధులు గతాన్ని తలుచుకుని బాధపడకుండా ఆనందంగా గడపడంతోపాటు తమ అనుభవాలను భావితరాలకు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణంలో వయోవృద్ధుల అనుభవాలు ఎంతో కీలకమన్నారు. తల్లిదండ్రులు తమ ఆస్తిపాస్తులను తమ వద్దే ఉంచుకోవాలని, అవసరమైతే వీలునామా రాయాలని కలెక్టర్ సూచించారు.
ఏమైనా సమస్యలు ఎదురైతే 14567 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సాయం పొందాలని తెలిపారు. అనంతరం కొత్తవాడలోని మట్టెవాడ, దయానంద్ చేనేత క్లస్టర్లను కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఉత్పత్తుల తయారీ విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, డీఏవో ఫణికుమార్, డీఎంహెచ్‌వో రాజారెడ్డి, పీడీ డీఆర్డీఏ నాగపద్మజ, ఆర్డీవో ఉమారాణి, జిల్లా వయోవృద్ధుల కమిటీ సభ్యులు మల్లారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
