వారంలో ఒకరోజు సప్లయర్లను ప్రొడక్షన్ బంద్ చేయమన్న సుజుకీ.. ఎందుకంటే?

వారంలో ఒకరోజు సప్లయర్లను ప్రొడక్షన్ బంద్ చేయమన్న సుజుకీ.. ఎందుకంటే?

ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్స్ భారత్‌లో తన సప్లయర్లకు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. వాహన ఉత్పత్తిని భారీగా పెంచే ప్రణాళికల్లో భాగంగా.. నాణ్యతా ప్రమాణాలు పాటించేందుకు, ప్రొడక్షన్ బ్రేక్ డౌన్స్ నివారించేందుకు సప్లయర్లు వారానికి ఒక రోజు మెషీన్ మెయింటెనెన్స్ కోసం ప్రొడక్షన్‌ను బంద్ చేయాలని ఆదేశించింది. జపాన్‌కు చెందిన ఈ వాహన తయారీ సంస్థ భారతీయ సప్లయర్లకు ఇలాంటి ఆదేశాలు చేయడం ఇదే మొదటిసారి.

భారతీయ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి 2030 నాటికి తన వార్షిక ఉత్పత్తిని ప్రస్తుత 24 లక్షల కార్ల నుంచి ఏకంగా 40 లక్షల కార్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ వృద్ధికి అనుగుణంగా రిస్క్ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే కొత్త మెయింటెనెన్స్ కండిషన్స్ తీసుకున్నారు. దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్, మహీంద్రా వంటి ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో.. మార్కెట్ వాటాను మళ్లీ దక్కించుకునేందుకు మారుతి కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

సాధారణంగా భారతీయ ఆటో కాంపోనెంట్ తయారీదారులు లాభాలు, గరిష్ట వినియోగం కోసం మెషీన్లను వారానికి 7 రోజులు నిరంతరం రన్ చేస్తుంటారు. అయితే ఇలా ప్రతిరోజూ యంత్రాలను నడపడం వల్ల ఫ్యాక్టరీ ప్రమాదాలు, అనుకోని అంతరాయాలు, క్వాలిటీ సమస్యలు వస్తాయని సుజుకి ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని 2027 సెప్టెంబర్ నాటికి సప్లయర్లు రోజుకు 20 గంటలు, వారానికి 6 రోజులు మాత్రమే ఆపరేట్ చేసే మోడల్‌కు మారాలని సుజుకి కోరింది. మిగిలిన 4 గంటలు యంత్రాలకు విశ్రాంతి, వారానికి ఒక పూర్తి రోజు మెయింటెనెన్స్ ఇవ్వాలని స్పష్టం చేసింది.

►ALSO READ | నెలకు రూ.లక్ష సంపాదన ఉంటేనే బెంగళూరు రండి.. మేనేజర్ కామెంట్స్‌పై చర్చ!

ఈ ఆదేశాలు సప్లయర్లకు కాస్త ఖర్చుతో కూడుకున్నవిగా మారే అవకాశం ఉంది. ప్రొడక్షన్ లైన్లను ఆపేయడం వల్ల తగ్గే ఉత్పత్తిని భర్తీ చేయడానికి సప్లయర్లు అదనపు కెపాసిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కొత్త ప్లాంట్లు, మెషీన్లలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆటో నిపుణులు అంటున్నారు.