ఇండియన్ సిలికాన్ వ్యాలీ బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నివసించాలంటే ఎంత జీతం ఉండాలనే దానిపై నెటిజన్ల పెద్ద చర్చ జరుగుతోంది. బెంగళూరుకు చెందిన ప్రొడక్ట్ మేనేజర్, కంటెంట్ క్రియేటర్ శివాంక్ గోయెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో ఈ డిబేట్‌కు ప్రధాన కారణమైంది. నగరంలో ఒక ప్రొఫెషనల్ ఎదుర్కొనే ఆర్థిక సవాళ్లను వీడియోలో పూసగుచ్చినట్లు వివరించటంతో రచ్చ మెుదలైంది.
నగరంలో సంపాదన, ఖర్చుల గురించి మాట్లాడుతూ.. నెలవారీ జీతం లక్ష రూపాయలకంటే తక్కువగా ఉన్నవారు బెంగళూరుకు రావటం గురించి ఆలోచించుకోవాలని గోయెల్ సూచించారు. బెంగళూరులో హౌసింగ్ రెంట్లు, రెస్టారెంట్లు, కేఫ్ కల్చర్, ఈవెంట్స్, హాబీలకు భారీగా ఖర్చు అవుతుందని తెలిపారు. బెంగళూరులో ఎంజాయ్ చేయడమంటే అతిగా ఖర్చు పెట్టడమే. ప్రతి ఈవెంట్‌కు టికెట్ ఉంటుంది, ప్రతి హాబీకి ఒక సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి వస్తుందని వెల్లడించారు. నగరంలో కమర్షియలైజేషన్ ఏ స్థాయిలో ఉందంటే.. ఏడాదికి 12 లక్షల రూపాయల జీతం కేవలం 4 లక్షల జీతంలాగే అనిపిస్తుందని, ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే డబ్బులు నీళ్లులా ఖర్చవుతాయని చెప్పారు.
అలాగే నగరంలో ఇళ్ల అద్దెలు, ట్రాఫిక్ సమస్యలపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఏ ప్రాంతంలో ఇల్లు వెతికినా భారీ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించడం ఇక్కడ సర్వసాధారణమైపోయిందని, రూ. 2 లక్షల డిపాజిట్ ఇవ్వడం ఎవరూ ప్రశ్నించకుండానే జరుగుతోందని అన్నారు. ఇక ప్రయాణాల విషయానికి వస్తే.. కేవలం 5 కిలోమీటర్ల దూరానికి క్యాబ్ బుక్ చేసుకుంటే రూ.600 వరకు ఖర్చు అవుతుందని, ట్రాఫిక్‌లో గంటల తరబడి ఇరుక్కుపోవడం సాధారణంగా మారిందని తెలిపారు. ఉచితంగా దొరికే ప్రత్యామ్నాయాలకు వెళ్లాలన్నా ముందురోజు నుంచి ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ వల్ల గంటల సమయం వ--ృధా అవుతుందని అభిప్రాయపడ్డారు.
►ALSO READ | ఢిల్లీలో మొబైల్ ఇంటర్నెట్ బంద్.. డిజిటల్ పేమెంట్స్ కు అంతరాయం
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బెంగళూరులో 10 రోజులు గడిపితే తన నెల జీతం ఖర్చవుతుందని ఒకరు కామెంట్ చేయగా, ఇది ఒక్క బెంగళూరు సమస్యే కాదని, మెట్రో నగరాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి అని మరో యూజర్ రాసుకొచ్చారు. ముంబైతో పోలిస్తే బెంగళూరు మెరుగేనని.. ముంబైలో జీవించాలంటే కనీసం రూ.3 లక్షల జీతం కావాలని మరొకరు అభిప్రాయపడ్డారు.
