- అక్టోబర్ 1నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
- ఒకే వేదికపై ఎన్‍పీడీసీఎల్, టీజీ రెడ్కో ప్రతినిధులతో సేవలు
వరంగల్, వెలుగు : ఎన్ పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో ఇంటింటికీ సోలార్ విద్యుత్ అందించడమే లక్ష్యంగా సంస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం 'సేవా సేతు' పేరుతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా ఇయ్యాల్టి నుంచి 3వ తేదీ వరకు అన్ని డివిజన్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వినియోగదారులు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా మిగులు విద్యుత్‍తో అదనపు ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తోంది.
పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన స్కీంలో భాగంగా...
పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకంలో భాగంగా గృహ వినియోగదారులు తమ ఇండ్ల పైకప్పులపై రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే అవకాశముంది. ఈ స్కీమ్ లో భాగంగా కిలో వాట్ కు రూ.30 వేలు, రెండు కిలో వాట్లకు రూ.60 వేలు, మూడు కిలో వాట్లకు గరిష్ఠంగా రూ.78 వేల వరకు కేంద్రం ఆర్థికసాయం అందజేస్తోంది. టీజీఎన్‍పీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే 29,621 రూఫ్‍టాప్ సోలార్ కనెక్షన్లు ఉండగా.. కొత్త కనెక్షన్ల కోసం మరో 20 వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.
నేటి నుంచి మూడు రోజులు ప్రత్యేక ప్రోగ్రామ్
గృహ వినియోగదారులు పీఎం సూర్యఘర్ ముఫ్తీ బిజ్లీ పథకం కింద రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు ఎన్‍పీడీసీఎల్ ప్రత్యేక చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా అర్హత కలిగిన గృహ వినియోగదారులకు అవకాశం కల్పించేలా ఎన్‍పీడీసీఎల్ అధికారులు, పథకాన్ని పర్యవేక్షిస్తున్న టీజీ రెడ్కో బ్యాంకర్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.
దీని వల్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు విధానం, దరఖాస్తు ప్రక్రియ, సబ్సిడీ, బ్యాంకు లోన్, నెట్ మీటరింగ్, విద్యుత్ బిల్లులో కలిగే ప్రయోజనాల వంటి అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు.
ఇదే అంశంపై ఇప్పటికే సంస్థ ఐపీసీ అండ్ రాక్ చీఫ్ ఇంజనీర్ కె.వెంకటరమణ ఆధ్వర్యంలో సీఈలు గౌతమ్ రెడ్డి, నాగప్రసాద్ అన్ని సర్కిళ్ల సూపరింటెండింగ్, డివిజనల్,అసిస్టెంట్ ఇంజనీర్లతో రివ్యూ నిర్వహించారు.
