నేతలందరి నోటా.. జెన్‌ జీ మాటే!..పంద్రాగస్టు ప్రసంగాల్లో  యువతపైనే లీడర్ల ఫోకస్ 

నేతలందరి నోటా.. జెన్‌ జీ మాటే!..పంద్రాగస్టు ప్రసంగాల్లో  యువతపైనే లీడర్ల ఫోకస్ 
  •  మోదీ మొదలు ఖర్గే, విజయ్, కేజ్రీవాల్, ఇతర నేతలంతా ఇదే తీరు 
  •     యువతపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ 
  • కూడా ప్రశంసలు 

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మొదలుకొని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం విజయ్, ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, ఇతర నేతలంతా మళ్లీ జెన్‌ జీ జపం అందుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు సీఎంలు, ప్రతిపక్ష నేతలు, ప్రముఖులంతా తమ ప్రసంగాల్లో యువతపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు.

ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి చేసిన 75 నిమిషాల ప్రసంగంలో ఏకంగా 50 సార్లకుపైగా యువత గురించే ప్రస్తావించారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, నషా ముక్త్ భారత్‌‌లో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. యువతకు ఏఐ ట్రెయినింగ్, ఫ్రీ ఆన్‌‌లైన్ కోచింగ్ వంటి పథకాలనూ ప్రకటించారు. అయితే, దేశ యువత కలలను కేంద్రం ఛిద్రం చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. కేంద్రం విధానాలతో నష్టపోతున్న యువత ఆందోళనల బాట పడుతున్నారని, వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. జెన్‌‌ జీలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారని, వారు ద్రోహులు కారన్నారు.

ఉత్తరప్రదేశ్‌‌లో ఏఐ, రోబోటిక్స్, మాన్యుఫాక్చరింగ్, ఇతర రంగాల్లో పెట్టుబడులు పెరిగాయని, తద్వారా 65 లక్షలకుపైగా యువతకు ఉపాధి అవకాశాలు దక్కాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలోని జెన్‌‌ జడ్, జెన్ ఆల్ఫా యువత రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇం జన్‌‌గా దోహదం చేస్తున్నారని కొనియాడారు. తమిళనాడు సీఎం విజయ్ కూడా జెన్‌‌ జీలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులు, జెన్‌‌ జీ ఫ్రెండ్స్‌‌ అందరికీ ‘వణక్కం’ అంటూ ప్రసంగా న్ని ప్రారంభించారు. ఇక జెన్‌‌ జీల తర్వాత జెన్ ఆల్ఫా యువత కూడా ఆందోళనల బాట పట్టారని ఆప్ కన్వీ నర్ కేజ్రీవాల్ అన్నారు. ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపర్చాలంటూ హిమాచల్, ఉత్తరాఖండ్, రాజస్తాన్‌‌లలో ఇలాంటి నిరసనలు జరిగాయని ఆయన ‘ఎక్స్’ వేది కగా పేర్కొన్నారు. కాగా, దేశానికి యువత ‘జనాభాపరమైన లాభం’ అని ఆర్ఎస్ఎస్ చీఫ్​మోహన్ భగవత్ అన్నారు. పది రోజుల్లోనే ఆయన రెండోసారి జెన్‌‌ జీల గురించి మాట్లాడారు. వారిని సరిగ్గా వినియోగించుకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని.. లేదంటే భవిష్యత్తులో సమాజంపై భారం పెరుగుతుందన్నారు.  

యువ లాయర్లపై నమ్మకం ఉంది: సీజేఐ

దేశ భవిష్యత్‌‌ బాధ్యతలను స్వీకరించేందుకు యువ లా గ్రాడ్యుయేట్స్, లాయర్లు సిద్ధంగా ఉండాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాటం నాటి నుంచి బార్ మోస్తున్న బాధ్యతలు త్వరలోనే యువ న్యాయవాదుల భుజాలపై పడనున్నాయని అన్నారు. సామాజిక వాస్తవాలపై యువతకు ఉన్న స్పృహ, సమానత్వం పట్ల వారికున్న దృక్పథం న్యాయవ్యవస్థ భవిష్యత్‌‌పై తనలో నమ్మకాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. యువ న్యాయవాదుల ఎదుగుదలకు బార్ అండ్ బెంచ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.