నేతాజీ సుభాష్ చంద్రబోస్ బర్మా (ప్రస్తుత మయన్మార్)లో ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ను ఉద్దేశించి (జులై 4, 1944) ప్రసంగిస్తూ ‘రక్తం ఇవ్వండి, మీకు నేను స్వాతంత్ర్యం ఇ(ప్పి)స్తాను’ అన్నారు. ఆ మాట భారత స్వాతంత్య్రోద్యమానికి వేయి ఏనుగుల బలాన్ని సంతరించింది. ‘మీ ప్రతిభ, శ్రమ, ఐక్యతను ఇలాగే చూపండి, మీకు నేను ఉద్యోగమో, ఉపాధో కల్పిస్తా, దేశాన్ని మనం అలా ముందుకు నడుపుదాం’ అనే భరోసా ఈ దేశపు యువతరానికి కావాలి. 145 కోట్ల జనాభాలో 52 శాతానికి పైబడి ఉన్న 30 ఏళ్లలోపు వయసు భారతీయ యువత మనోభావాలు అర్థం చేసుకొని, వారి భాషలో, వాళ్ల మనసుతో మాట కలిపే నాయకులు, రాజకీయ పార్టీలు కావాలిప్పుడు. ఆ మర్మం గ్రహించకుండా, పడికట్టు పదాలతో, కాలం చెల్లిన భాషతో ఎవరు ఎంత సొల్లు ప్రసంగించినా ఇకపై ఒరిగేది నిల్లు, ఆ శకానికిక చెల్లు! ‘కాక్రోచ్’ స్వగతంలా పుట్టి, ఆన్‌లైన్ వేదికగా ఎదిగి, ‘జంతర్ మంతర్` నుంచి ఉద్యమమై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడమే కాకుండా దేశప్రజలందరి గుండెల్ని తాకిన యువ సత్తువ తెలిపిన సందేశం ఇదే! వారిప్పుడు, ‘ఏమిటి? తదుపరి’ అని ఆలోచిస్తున్నారు. ‘మరి, మనకేమిటి మార్గం?’ అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది మన రాజకీయ వ్యవస్థే!
ప్రపంచ దృష్టిని ఆకర్షించిన భారతీయ జెన్- జీ
ఉద్యమం పైన, అది కలిగించిన ప్రభావం పైన ఒక లోతైన అధ్యయనం జరగాలి. ఎందుకంటే, అది కలిగించిన ప్రభావం, ఫలితం సాధించిన తీరు ప్రశంసనీయంగా ఉంది. దాన్నుంచి యువతరం
నేర్చుకోవాల్సింది, పాలనా వ్యవస్థలు మార్చుకోవాల్సింది, రాజకీయ పార్టీలు కొత్తగా అలవర్చుకోవాల్సింది ఎంతగానో ఉంది. న్యాయ విద్యలో ప్రతిష్ట గడించిన మన ‘నల్సార్’ విశ్వవిద్యాలయం నుంచి, ఎక్కడో విసిరేసినట్టు దేశం ఒక మూలన ఉండే ‘త్రిపుర’ విశ్వవిద్యాలయం వరకు విద్యార్థులను ఈ ఉద్యమం కదిలించగలిగింది. పాలక పక్షానికి గుడ్డిగా కొమ్ముకాసే కొంతమంది అంధభక్తులు పనిగట్టుకొని జరిపిన వ్యతిరేక ప్రచారం తప్ప యువ ఆందోళన గురించి అనుకూల, ప్రశంసాపూర్వక స్పందనలే అధికంగా వ్యక్తమయ్యాయి. ఉద్యమ ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయనడానికి, ‘నల్సార్’ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పిలవొద్దని లా విద్యార్థులు చేస్తున్న వినతుల వెల్లువే నిదర్శనం.
ఎంతగా నొచ్చుకోకుంటే..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే, మొత్తం దేశ న్యాయ వ్యవస్థకు తలకాయ వంటివాడు, అతని చేతుల మీదుగా పట్టా అందుకోవడాన్ని ఏ విద్యార్థి అయినా గర్వంగా, జీవితకాలపు జ్ఞాపకంగా
భావిస్తారు. అటువంటిది ఆయన్ని ముఖ్య అతిథిగా పిలవొద్దు, ఆయన నుంచి మేం పట్టా స్వీకరించలేం’ అని పట్టుబట్టారంటే యువహృదయాలు ఎంతగా కలతచెంది ఉంటాయి? శాంతియుత నిరసనకారులపై పోలీసులు జులుం చేసి రక్తం చిందేలా దాడి, హింసకు తలపడితే, ఆ వీడియోలు చూడ్డానికి సీజేఐ ‘మాకు సమయం లేదు, ఆసక్తి లేదు’ అంటారా? అన్నది వారి అభ్యంతరం. నల్సార్ విద్యార్థిని అఖిలను కదిలించినప్పుడు ‘మేం ఏం కోరుతున్నాం? రాజ్యాంగం కల్పించిన హక్కులకు భరోసా, న్యాయానికి అవకాశం, యూనివర్సిటీ ప్రకటించుకున్న విలువలకు నిలబడటం... ఈ మూడేగా’ అనటంలో ఎంతో స్పష్టత, నిజాయితీ, నిబద్ధత కనిపిస్తాయి. గిట్టనివారు దుష్ప్రచారం చేసినట్టు విద్యార్థి యువ ఉద్యమం రాజకీయ ఉద్దేశ్యాలతో జరిపింది కాదు అనడానికి, ఇతర రాజకీయ కూటమి అధికారంలో ఉన్న జార్ఖండ్‌లోనూ పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఉద్యమించడమే తార్కాణం. ‘చూడం, ఆసక్తిలేదు, కోర్టు సమయం వృథా చేయకండి’ అన్న గొంతే ‘నిరసనలపై పోలీసులు దాష్టీకాలు తప్పు, ముందుగా చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ సాగాలి’ అని న్యాయపీఠం గొంతు సవరించడం ఉద్యమ ప్రభా వమే! ‘నిరసనలు దేశ ద్రోహం కాదు, వారితో చర్చించాలి.. జెన్- జీ తరంలో అధిక నిజాయితీ ఉంది, వారు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు’ అని ఆర్‌ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్య వెనుక యువజనోద్యమ ప్రభావం లేదనుకోగలమా?
సమర్థ సమ్మేళనం
కార్పొరేటీకరణలో లీనమైన సంప్రదాయ మీడియా, ముఖ్యంగా పాలక‘పక్షపాతి’గా ముద్రపడ్డ ‘గోదీ’ మీడియాకు జెన్ -జీ ఉద్యమం షాక్ ఇచ్చింది. వారి ఇన్నాళ్ల సమాచార గుత్తాధిపత్యానికి గండికొట్టింది. ‘అవును మద్దతిచ్చాం, ఢిల్లీ వెళ్లాలనే ఏముంది? ఇక్కడినుంచే ఉద్యమాన్ని బలోపేతం చేశాం’ అన్న అరడజను త్రిపుర యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల ఆత్మవిశ్వాసం నిండిన స్వరం, యువజనోద్యమ వ్యాప్తికి అద్దం పట్టింది. ‘జీవితంలో పేపర్ చదవలేదు. వార్తల కోసం టీవీ చూడను, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నుంచే ఏ నూతన పరిణామాలైన తెలుసుకుంటుంటాను’ అన్న ప్రీతి సాహ అనే పీజీ విద్యార్థి మాటల్లో వాళ్ల తరం భాష, పంథా, ప్రాధాన్యతలు ఇట్టే వ్యక్తమయ్యాయి. ఎవరో హిస్టారియన్ అన్నట్టు, న్యూయార్క్ (యుఎస్) సిటీ మేయర్‌గా గెలిచి చరిత్ర సృష్టించిన జోహ్రాన్ మమ్దాని వ్యూహం అనుసరించారు జెన్ -జీ నిరసనకారులు. విరివిగా ఏఐ టూల్స్ వాడిన ఈ యువ నాయకుల వ్యక్తీకరణల్లోనూ...
క్లుప్తత, స్పష్టత, ప్రసంగాల్లో-, సంభాషణల్లో ప్రవాహధార కొట్టొచ్చినట్లు కనిపించింది.
కాక్రోచ్ యువశక్తి దూసుకొస్తోంది తస్మాత్ జాగ్రత్త!
నీట్ పరీక్ష లీక్, విద్యా సంస్కరణలు, సర్కారు జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయడం వరకే వీరి ఉద్యమం పరిమితం కాలేదు. అసలు విద్యావ్యవస్థలో మత వైఖరుల జాడ్యాన్ని పటాపంచలు చేసింది. ఉద్యమం ఉత్తర, దక్షిణ సరిహద్దుల్ని చెరిపేసింది. ఉత్తరాది ఒక హిందూ నిరుద్యోగ విద్యార్థి, దక్షిణాది మరో ముస్లిం గ్రాడ్యుయేట్ నీట్ పేపర్ లీక్ వల్ల ఇరువురూ సమంగా నష్టపోయారు, సమాన కోపంతో ఉన్నారని ఉద్యమం చాటిచెప్పింది. ‘రండి బ్రదర్ మాతోపాటు భోంచేద్దురు, ఆకలిగా ఉన్నారు’ అని లాఠీచార్జీకి వచ్చిన పోలీసుల్ని యువతులు పిలవటం, వాటర్ క్యానన్ ప్రయోగిస్తున్న వ్యక్తితో ‘రేపు కూడా రండి అంకుల్, స్నానం చేయాలి’ అని కవ్వించడం, ‘అవును మేం బొద్దింకలమే,
ఏ ప్రతికూల వాతావరణంలోనైనా మేం మనగలం’ అని సవాల్ చేయడం. రక్తమోడే కష్టాల్లో కూడా
‘సెటైరికల్’గా ప్రవర్తిస్తూ యువత ఉద్యమాన్ని సుస్థిరపరిచింది. నిరసనకు కొత్తనిర్వచనమిచ్చి, సరికొత్త ‘నమూనా’ ఆవిష్కరించింది. పనిచేసినా, చేయకపోయినా... పరస్పర వ్యతిరేక పార్టీలు ‘నువ్వు కాకుంటే నేను, నేను కాకుంటే నువ్వు’ అని సర్దుబాటు చేసుకునే రాజకీయాలకు కాలం చెల్లింది. ఇద్దరూ నచ్చకుంటే, ప్రజలు రాత్రికి రాత్రి మనసు మార్చుకుని అనామక మూడో శక్తికి పట్టం కట్టిన (తమిళనాడు) ‘రాజకీయ నమూనా’లూ తెరపైకి వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ‘ప్రెషర్ గ్రూప్’గా పనిచేస్తామంటున్న కాక్రోచ్ యువశక్తి దూసుకొస్తోంది తస్మాత్ జాగ్రత్త! నవతరం యువత సరేసరి, ఇక వైఖరి మార్చుకోవాల్సింది, కళ్లు తెరవాల్సింది మన రాజకీయ పార్టీలే!
రాజకీయాలు మారాలి
‘పిడుగుకి, బియ్యానికి ఒకే మంత్రం’ అన్నది మన వాళ్లు తరచూ వాడే ముతక సామెత. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని మన సంప్రదాయ రాజకీయ పార్టీలు గుర్తించడం లేదు. జనాభాలో 52 శాతాన్ని దాటుతున్న 30 ఏళ్లలోపు వారి ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, పాలకులు అందుకనుగుణంగా నడుచుకోలేకపోతున్నారు. ఫలితంగా తమ విధానాలతోనో, పథకాలు, కార్యక్రమాలతోనో కొత్తతరానికి కనెక్ట్ కావటం లేదు. పైగా రోజురోజుకూ కేంద్రీకృతమౌతున్న ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీలు నిన్నటి ఉద్యమంతో బిత్తరపోయాయి. ఎందుకంటే, ఆయా పార్టీల అనుబంధ విద్యార్థి, యువజన విభాగాలు నిద్రాణమై, నిర్వీర్యమైన స్థితిని ఉద్యమం ఎత్తి చూపింది. యువజన ఉద్యమాన్ని తమ అనుకూల యువకులతోనే తిప్పికొట్టాలనుకొని పాలకవర్గాలు చేసిన యత్నాలు, ఈ ఉద్యమ ఘనతనంతా తమ ఖాతాలో వేసుకుందామని విపక్షాలు చేసిన కుయత్నాలు బెడిసికొట్టాయి. ఇకనైనా ఉద్యమం నుంచి పాఠాలు నేర్చుకోవడానికి రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో యత్నించాలి. నిరసన ఉద్యమాలను యువత స్వయంగా నిర్మించిన సందర్భాలు మన చరిత్రలో కోకొల్లలు. అది భారత స్వాతంత్య్రోద్యమం కావచ్చు. ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం అవొచ్చు. నిన్నా, ఇవాల్టి నిర్భయ, లోక్‌పాల్ ఆందోళనలు కావొచ్చు, కాకపోతే దేని స్వరూపం దానిది, ఎప్పటి ప్రభావం అప్పటిది. ఆ గ్రహింపు రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా పాలకులకు అవసరం.
- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
