అదును దాటినంక చేప పిల్లల పంపిణీ.. ఆగస్ట్ లోనే టెండర్లు.. ఆలస్యంగా సరఫరా

అదును దాటినంక చేప పిల్లల పంపిణీ.. ఆగస్ట్ లోనే టెండర్లు.. ఆలస్యంగా సరఫరా
  •     చెరువులు, కుంటల్లో కనిపించని నీళ్లు.. చేపల ఎదుగుదలపై అనుమానాలు
  •     రూ. 133.31 కోట్లతో పిల్లలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం 

 హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  చెరువులు, కుంటల్లో నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడే చేప పిల్లలను వదిలాల్సి ఉండగా.. ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వానాకాలం ముగింపు దశలో సోమవారం నుంచే రాష్ట్రంలో చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. చెరువులు, కుంటలు పూర్తి స్థాయిలో నిండకపోవడం, ఉన్న కొద్దిపాటి నీరు మరో రెండు, మూడు నెలల్లోనే తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో చేప పిల్లలను వదిలితే అవి ఎంతకాలం బతుకుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రూ.133.31 కోట్లతో చేప, రొయ్య పిల్లలను పంపిణీ చేస్తున్నప్పటికీ అదును దాటి పోవడంతో నిధులు వృథా అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

నీళ్లు తగ్గే సమయంలో పిల్లలు పంపిణీ

ఈ వానాకాలంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో లేదు. సెప్టెంబరు 18 నాటికి రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 640 మిల్లీమీటర్లకు గాను 543 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌‌‌‌లో 12 శాతం, ఆగస్టులో 38 శాతం లోటు ఏర్పడింది. దీంతో అనేక చిన్న చెరువులు, కుంటల్లో పూర్తి స్థాయిలో నీరు చేరలేదు. సాధారణంగా వానాకాలంలో చెరువులు, కుంటలు నీటితో నిండిన వెంటనే చేప పిల్లలను వదలాలి. అలా అయితే చేపలు ఎదిగేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. సీజన్‌‌‌‌ ముగిసే నాటికి చేపలు పూర్తిస్థాయిలో ఎదగడం వల్ల మత్స్యకారులకు ఆదాయం వస్తుంది. కానీ ఈ సారి వర్షాలు ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం ఉండడం వల్ల నీటి లభ్యతపై సందేహాలు నెలకొన్నాయి. చేప పిల్లల పంపిణీకి ఆగస్టులోనే టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, వర్షాలున్నప్పుడే చేప పిల్లలను వదలాలని నిర్ణయించినప్పటికీ పంపిణీ ఆలస్యమైందని మత్స్యకార సంఘాలు చెబుతున్నాయి. చివరకు సెప్టెంబరు 28న మంత్రుల చేతుల మీదుగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో నీళ్లు వచ్చినప్పుడు చేప పిల్లల పంపిణీ పట్టించుకోకుండా.. నీళ్లు తగ్గే సమయానికి పంపిణీ మొదలుపెట్టడమేంటని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.

 84.59 కోట్ల చేప, 10 కోట్ల రొయ్య పిల్లలు

చేప, రొయ్య పిల్లల పంపిణీకి 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.133.31 కోట్లను ఖర్చు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 26,547 నీటి వనరుల్లో 84.59 కోట్ల చేప పిల్లలను, దాదాపు 300 నీటి వనరుల్లో 10 కోట్ల రొయ్య పిల్లలను 100 శాతం రాయితీపై పంపిణీ చేయాలని మత్స్యశాఖ నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు ఐదు లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలుగుతుందని మత్స్యశాఖ చెబుతోంది. 2026–27లో ఆరు లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారీగా చేప పిల్లలను చెరువుల్లో వదలడమే లక్ష్యమా.. లేక అవి పెరిగి మత్స్యకారులకు ఆదాయం వచ్చేలా చూడటమా ? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చేప పిల్లల పంపిణీ సంఖ్యను ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. అవి పెరగడానికి అవసరమైనంతకాలం చెరువుల్లో నీరు ఉంటుందా అన్న ఆందోళన నెలకొంది.
 
అధికారుల తీరుపై విమర్శలు

చేప పిల్లల పంపిణీలో ఆఫీసర్ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేప పిల్లల పంపిణీ ఆలస్యానికి కారణాలేంటి.. ఆగస్టులో టెండర్లు పూర్తయినా సెప్టెంబరు చివరి వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది.. నీళ్లు ఉన్న చెరువుల్లో ముందుగా ఎందుకు పోయడం లేదు, ప్రతి నీటి వనరులో నీటి మట్టం, నిల్వ ఉండే కాలాన్ని అధికారులు అంచనా వేశారా, నీరు త్వరగా తగ్గిపోయే చెరువుల్లో చేప పిల్లలను వదిలే నిర్ణయం ఎలా తీసుకున్నారు ? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.