వెలుగు స్పెషల్ : చేనేతకు చేతలు.. అవినీతిపై చర్య లు అవసరం 

వెలుగు స్పెషల్ : చేనేతకు చేతలు.. అవినీతిపై చర్య లు అవసరం 


‘పెట్టుబడి ఎక్కడ కేంద్రీకృతమైతే వలసలు అక్కడికి నిరంతరంగా కొనసాగుతాయి’. ఈ ఆర్థిక నిర్వచనానికి తగ్గట్టుగా వరంగల్, జనగామ, హుస్నాబాద్, హుజూరాబాద్ తదితర  ప్రాంతాలలో  మెల్లమెల్లగా చేనేత కుటీర పరిశ్రమ కునారిల్లిపోవడం వలన  ఆ రంగంలో పనిచేస్తున్న కార్మికులు బతుకుతెరువును వెతుక్కుంటూ..అప్పటికే  సిరిసిల్లలో చేనేత పరిశ్రమ మహోజ్వలంగా  వర్ధిల్లుతున్న కారణంగా పొట్ట చేతపట్టుకొని వలస వచ్చారు.  అనేక ప్రజా ఉద్యమాల మూలంగా తెలంగాణ  రాష్ట్రంగా 2014 జూన్ 2న ఆవిర్భవించింది. అయితే  సిరిసిల్లలో చేనేత పరిశ్రమ పరిణామ క్రమంలో మరింత మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి చెందలేకపోగా  చేనేత కార్మిక కుటుంబాలలో చాపకింద నీరులా సంక్షోభం కొనసాగుతూ వస్తున్నది.

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరున 2018 నుంచి 2022– 23 సంవత్సరం వరకు ఏటేటా మొత్తం కలుపుకొని రూ.2100 కోట్ల ఆర్డర్లు ఇచ్చింది. సిరిసిల్ల, దర్శకుర్తి తంగళ్ళపల్లి,  కొత్తపల్లి ప్రాంతాలను కలుపుకుంటే  సుమారు 25000 పవర్‌‌‌‌లూమ్స్‌‌ ఉన్నాయి.  దీనితో  నేత కార్మికులకు   సంవత్సరానికి సుమారు 6 నెలల పని దొరికింది . చేనేత మగ్గం దాదాపుగా అంతరించిపోగా, పవర్‌‌‌‌లూమ్‌‌ నేత పరిశ్రమగా విరాజిల్లుతున్నది. ఈ పరిశ్రమలో  సేట్లు, ఆసాములు,  కార్మికులుగా మూడు అంచెల మనుగడ సాగుతున్నది. 


135 మ్యాక్స్ సొసైటీలు

రాష్ట్ర టెస్కో విభాగం ద్వారా నేత పరిశ్రమలోని మూడంచెల వ్యవస్థ స్థానంలో కార్మికులే సభ్యులుగా  135 మ్యాక్స్ సొసైటీలను స్వయం సహాయకంగా  అభివృద్ధి చెందడానికి ఏర్పాటు చేసినది. అయితే ఈ సొసైటీలకు తగిన ఆర్థిక వనరులు స్తోమత  లేకపోవడం వలన స్వయం సహాయక సంఘాలు తిరిగి మాస్టర్  వీవర్స్ చేతుల్లోకే  వెళ్లిపోయాయి. దీంతో నేత కార్మికుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి  అక్కడ  వేసినట్లే ఉంది.   మరొకవైపు 2022-–2023 సంవత్సరంలో  బతుకమ్మ చీరలు సరఫరా చేయగా గత ప్రభుత్వం  రూ.300 కోట్లు బకాయి చెల్లించవలసి ఉన్నది.  బకాయి మెలిక కారణంగా సేట్లు తిరిగి  కేటీఆర్  గెలుపునకు  కారణభూతమయ్యారు. అయితే  2023  చివర్లో జరిగిన  ఎన్నికల  పిదప  ఏర్పడిన ప్రభుత్వం ఆ బకాయిని చెల్లించడమే కాకుండా,   సిరిసిల్ల నేత పరిశ్రమకు ఇందిరమ్మ స్వయం సహాయక చీరల ఆర్డర్లను ఇచ్చి పునరుత్తేజం కలిగించేలా కార్యాచరణ రూపొందించినది. అంతేకాక 5 హెచ్‌‌పీల  వరకు ఉన్న కుటీర పరిశ్రమ గుర్తింపును 25 హెచ్‌‌పీల వరకు పెంచి 50%  విద్యుత్తు  రాయితీ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినది. ఈ పరిశ్రమపై ఆధారపడిన మొత్తం 8,000 మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. 

12% జీఎస్టీతో సంక్షోభం

పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తూ పరిశ్రమకు సహాయం అందిస్తున్నది.  కర్నాటక రాష్ట్రంలో 10 హెచ్‌‌పీల వరకు పూర్తిగా ఉచితంగా కరెంటును  నేత పరిశ్రమకు అందజేస్తున్నది.  ఈ  పరిశ్రమ పెద్ద టెక్స్ట్‌‌టైల్  కంపెనీలతోపాటు  సిరిసిల్లలాంటి మధ్య,  దిగువ తరగతి  పవర్‌‌‌‌లూమ్‌‌ పరిశ్రమను  ఒకే గాటన కట్టి  కేంద్ర ప్రభుత్వం 12% జీఎస్టీ విధించడం వలన మళ్లీ పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతున్నది.  చివరగా  మాక్స్ సొసైటీలను  ప్రభుత్వం ఆర్థికంగా బలోపేతం చేస్తే  నేత  కార్మికులకు చేయూతగా ఉంటుంది.  అంతవరకూ సిరిసిల్ల ప్రాంతంలోని  నేత పరిశ్రమనే కాదు  తెలంగాణ రాష్ట్రంలోని  పోచంపల్లి,  నారాయణపూర్,   భువనగిరి తదితర ప్రాంతాలలో ఉన్న పెద్ద సీట్ల కౌగిలిలో నుంచి  పరిశ్రమలు విడుదల చేస్తే కానీ  నేత కార్మికుల  కుటుంబ స్థితిలో ఎలాంటి మార్పురాదు. మార్పు రావాలని ఆశించడం కూడా దురాశ అవుతుంది.  ఇకపోతే  సిరిసిల్ల  కేటీఆర్  నియోజకవర్గం కావడమే కాకుండా,  కేటీఆర్‌‌‌‌ బీఆర్ఎస్ పార్టీ  కార్యనిర్వాహక అధ్యక్షుడు కావడంతో ఈ ప్రాంతం అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది.  ఈ నేపథ్యంలో  ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గం మీద  ప్రత్యేక దృష్టి  సారించాలి.

 అవినీతి, అక్రమాలపై  చర్యలు తీసుకోవాలి

పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడడం వేరు...  ముఖ్యమంత్రిగా శాసనసభ వేదికగా,  వివిధ బహిరంగ సభలలో  సంభాషించడం వేరు. ఈ దృష్టితో ప్రజలు చూస్తారు. తెలంగాణ జాగరూక సమాజం కావడం వలన ప్రజలకు  అవకాశం వచ్చినప్పుడు  కర్రు కాల్చి వాత పెడతారు.  ఇది  గత  పాలకులకు అనుభవంలోకి వచ్చినా అర్థం కావడం లేదు.  ఇంకా ముఖ్యంగా కేటీఆర్ అయితే చిన్నంతరం, పెద్దంతరం లేకుండా మాట్లాడడం ద్వారా తెలంగాణ  ప్రజలలో మరింత చులకన అయిపోతుంటారు తప్ప పెద్దగా ఒరిగేదేమీ,  జరిగేది ఏమీ ఉండదు.  కేటీఆర్‌‌‌‌, కుటుంబ సభ్యులు, అధినాయకుడు గత పాలనలో చేసిన  ‘కారుగుజారీ’ పనులు ప్రజలు  ఇప్పట్లో మరిచిపోయే సూచన  కనిపించడం లేదు.  ఏది ఏమైనా  రాష్ట్ర  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సిరిసిల్లకు వస్తున్న సందర్భంగా..భూమిలో దొంగలు పడ్డారు సరే కానీ,  పందికొక్కులను,  గుంట నక్కలను  పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఆ దిశగా పనిచేస్తే  ప్రజలలో  సమర్థ పాలకుడిగా శాశ్వతంగా నిలిచిపోతాడని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు  గడిచిన మూడు సంవత్సరాలుగా దర్యాప్తులు,  నివేదికలు,  కేసులు ప్రక్రియ  కొనసాగుతూ వస్తున్నది ఇప్పటికైనా అక్రమాలు,  అవినీతి చేసిన  నాయకులను బోనులో నిలిపి తగిన చర్యలు  తీసుకోవాలని తెలంగాణ సమాజం ఆశిస్తున్నది.   సీఎం రేవంత్‌‌రెడ్డి  తక్షణం చర్యలు తీసుకుంటేనే  ప్రజలు హర్షిస్తారు. 

- జూకంటి జగన్నాథం
కవి, రచయిత