- ప్రైమరీకి రూ.2, హైస్కూల్‌కు రూ.3 చొప్పున చెల్లింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కూళ్లలో సమ్మెటివ్ అసెస్‌మెంట్ (ఎస్ఏ-1,-2) పరీక్షల వాల్యువేషన్ సంబంధించి విద్యాశాఖ రెమ్యునరేషన్‌ను ఖరారు చేసింది. ఇకపై విద్యార్థుల జవాబు పత్రాలను దిద్దే టీచర్లకు ప్రతి ఆన్సర్ స్క్రిప్ట్‌కు ప్రైమరీ స్థాయిలో రూ.2, హైస్కూల్ స్థాయిలో రూ.3 చొప్పున చెల్లించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు.
స్కూల్ ఎడ్యుకేషన్ లో పారదర్శకత పెంచేందుకు ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కొత్త విధానం ప్రకారం.. పరీక్షలు ముగిసిన వెంటనే ఆన్సర్ స్క్రిప్ట్‌లను హెడ్‌మాస్టర్ల ద్వారా సేకరించి మండల రిసోర్స్ సెంటర్ వద్ద ఎంఈఓ ఆధ్వర్యంలో భద్రపరుస్తారు. మండలాల పరిధిలోని ఇతర స్కూళ్ల టీచర్లతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తారు. వాల్యువేషన్ సెంటర్ల నిర్వహణకు కూడా ప్రతి మండలానికి రూ.పదివేల బడ్జెట్‌ను కేటాయించారు. ఈ ప్రక్రియను కచ్చితంగా 3 నుంచి 5 రోజుల్లో పూర్తి చేసి, అదే రోజు మార్కులను ఆన్‌లైన్ ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు.
