శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) యూనిట్‌లోని ఓ జవాన్ తన తోటి సిబ్బందిపై కాల్పులు జరిపాడు. దీంతో ఓ ఆఫీసర్ తో సహా నలుగురు సోల్జర్స్ చనిపోయారు.
బసోహ్లీ ఏరియాలోని ‘సేవా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్’ వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలు భద్రతా విధులను నిర్వహిస్తున్నాయి. అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అవధేష్ కుమార్ సింగ్‌కు, తోటి సిబ్బందికి మధ్య మంగళవారం సాయంత్రం వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన అవధేష్ తన సర్వీస్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడు. ఘటనలో అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బాధితులను హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌పీసీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తోటి ఉద్యోగుల మధ్య చెలరేగిన వివాదం ఏకంగా నలుగురు ప్రాణాలను బలిగొనడం తీవ్ర కలకలం రేపింది. నిందితుడు అవధేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
