- నాలుగేళ్లుగా ప్రహసనంగా మారిన బయోమైనింగ్
- కరీంనగర్ డంపింగ్ యార్డులో ఇప్పటికే రూ.9 కోట్లు ఖర్చు
- చేసిన బల్దియా తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరో రూ.16 కోట్లతో టెండర్లు
- ఈ సారైనా రూ.కోట్లు వృథా కాకుండా యార్డ్ క్లియర్ చేయాలని కోరుతున్న సమీప కాలనీల ప్రజలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మానేరు ఒడ్డున ఉన్న డంపింగ్ యార్డును తొలగించేందుకు చేపట్టిన బయోమైనింగ్ నాలుగేళ్లుగా ప్రహసనంగా మారింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా చెత్త మాత్రం గుట్టలుగానే మిగిలిపోయింది. గతంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లు కేటాయించి.. రూ.7 కోట్ల వరకు ఖర్చు చేయగా.. నిరుడు, ఈ ఏడాది స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరో రూ.2 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా బల్డియా రూ.9 కోట్లు ఖర్చు చేసినా చెత్త మాత్రం గుట్టలుగా పేరుకుపోయి ఉంది. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద బయో మైనింగ్ కోసం మరో రూ.16 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు. కోట్లాది రూపాయలు చెత్త పాలవుతున్నా.. డంపింగ్ యార్డు క్లియర్ కాకపోవడంపై సమీప కాలనీల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు బయోమైనింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు సగం బిల్లులు డ్రా చేసి చేతులెత్తేశాయని, ఈసారైనా పూర్తిచేయగలిగే సామర్థ్యం ఉన్న ఏజెన్సీలకే కాంట్రాక్ట్ అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.
రూ.9 కోట్లు ఖర్చు చేసినా సగం చెత్త కూడా సాఫ్ కాలే..
మానేరు తీరంలోని డంపింగ్ యార్డులో దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించి.. ఆ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేసేందుకు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.16 కోట్లతో 2022 జూన్ లో బయోమైనింగ్ ప్రారంభించారు. ఈ డంపింగ్ యార్డులో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త ఉన్నట్లు అప్పట్లో అధికారులు లెక్కగట్టారు. అగ్రిమెంట్ ప్రకారం.. ఏడాదిలోనే డంప్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్త నుంచి మట్టి, ప్లాస్టిక్ వేరు చేయాలని, సేంద్రియ ఎరువులు కూడా ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ ఏడాదికే బయోమైనింగ్ నిలిచిపోయింది. ఆ తర్వాత రెండు, మూడు సార్లు మళ్లీ ప్రారంభించినట్లే చేసి.. ఆపేశారు.
మొత్తంగా నిరుటి వరకు 1.05 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను ప్రాసెస్ చేసినట్లు లెక్కగట్టి సుమారు రూ.7 కోట్ల వరకు కాంట్రాక్ట్ ఏజెన్సీకి రిలీజ్ చేశారు. ఆ తర్వాత సంబంధిత కాంట్రాక్ట్ ఏజెన్సీ హర్షిత ఇన్ ఫ్రాను బయోమైనింగ్ నుంచి టర్మినేట్ చేశారు. అప్పటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు డెడ్ లైన్ కూడా క్లోజ్ కావడంతో మిగతా నిధులు రాకుండాపోయాయి. మొత్తంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ, ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ నిధుల్లో సగం కూడా సద్వినియోగం కాలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిరుడు నవంబర్ లో స్వచ్ఛ భారత్ మిషన్(అర్బన్) 20 కింద రూ.2 కోట్లతో డంపింగ్ యార్డులో బయోమైనింగ్ చేపట్టారు. ఇలా రూ.9 కోట్లు ఖర్చు చేసినా సగం చెత్త కూడా తగ్గకపోవడం, అధికారులు బిల్లులు విడుదల చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మళ్లీ రూ.16 కోట్లతో టెండర్లు
కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పనులు ప్రారంభించేందుకు 2025 జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరీంనగర్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డంపింగ్ యార్డు చెత్తను పూర్తిగా క్లియర్ చేసేందుకు ఎన్ని కోట్లయినా వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరో రూ.16 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో బయోమైనింగ్ చేపట్టేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. డంపింగ్ యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని, అనారోగ్యం పాలవుతున్నామని, ఈ సారైనా ప్రజాధనం వృథా కాకుండా యార్డును క్లియర్ చేయాలని సమీప కాలనీ ప్రజలు
కోరుతున్నారు.
