ఏప్రిల్ నుంచి నాలుగు చెత్త డబ్బాలు!..తడి, పొడి, ఈ-వేస్ట్‌‌‌‌, శానిటరీ వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ

ఏప్రిల్ నుంచి నాలుగు చెత్త డబ్బాలు!..తడి, పొడి, ఈ-వేస్ట్‌‌‌‌, శానిటరీ వ్యర్థాలు వేర్వేరుగా సేకరణ
  •     అమలుకు మూడు కార్పొరేషన్లు రెడీ  
  •      గ్రీన్, బ్లూ,రెడ్, బ్లాక్ కలర్లలో.. 
  •     రీసైకిలింగ్ కు ఈజీ అవుతుందని కొత్త ప్లాన్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  స్వచ్ఛ భారత్ మిషన్–2026 గైడ్​లైన్స్​కు అనుగుణంగా క్యూర్ పరిధిలోని ఇండ్లలో నాలుగు చెత్త డబ్బాల విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చెత్తను ఇంట్లోనే వేరు చేసేందుకు వీలుగా ఈ నాలుగు డస్ట్ బిన్ల విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఇండ్లు, షాపుల నుంచి సేకరించే చెత్తలో తడి, పొడి వ్యర్థాలతో పాటు ఈ-వేస్ట్‌‌‌‌, శానిటరీ వ్యర్థాలు కలిసిపోతున్నాయి. దీంతో ఈ చెత్తను డంప్‌‌‌‌యార్డులకు తరలించిన తర్వాత వేరు చేయడం ఇబ్బందిగా మారింది. అదే టైంలో రీసైక్లింగ్‌‌‌‌కు ఉపయోగపడే వ్యర్థాలు కూడా ఇతర చెత్తతో కలిసి వృథా అవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చెత్తను నాలుగు విభాగాలుగా వేరు చేసి సేకరించే విధానాన్ని తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి నాలుగు రంగుల చెత్త డబ్బాలను ఇస్తారు. ఒక్కో డబ్బాలో తడి, పొడి, ఈ వేస్ట్​, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా వేసి చెత్త సేకరణకు వచ్చే వారికి అప్పగించాలి. 

ఏ డబ్బాలో ఏం వేయాలి? 

ఆకుపచ్చ డబ్బాలో ఇండ్లలో మిగిలిపోయిన ఆహారం, కూరగాయలు, పండ్ల తొక్కలు, మీట్ వ్యర్థాలు, గుడ్డు తొక్కలు, ఫ్లవర్స్ తదితర తడి వ్యర్థాలు వేయాలి.. బ్లూ డబ్బాలో ప్లాస్టిక్‌‌‌‌, కాగితం, ప్లాస్టిక్‌‌‌‌, కార్డ్‌‌‌‌బోర్డ్‌‌‌‌, గాజు, లోహాలు, ..ఎరుపు డబ్బాలో డైపర్లు, శానిటరీ న్యాప్‌‌‌‌కిన్లు, టిష్యూస్​, ఇతర శానిటరీ సంబంధిత వ్యర్థాలు వేయాలి..ఇక నలుపు డబ్బాలో కాలంచెల్లిన మందులు, వాడిన సిరంజిలు, పనిచేయని ఎలక్ట్రానిక్‌‌‌‌ పరికరాలు, బల్బులు, బ్యాటరీలు, పెయింట్‌‌‌‌, ఈ-వేస్ట్‌‌‌‌ వంటి గృహ ప్రమాదకర లేదా ప్రత్యేక వ్యర్థాలను వేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్కడికక్కడ చెత్తను వేరు చేయడం వల్ల రీసైక్లింగ్‌‌‌‌కు ఈజీ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.  

డంపింగ్​యార్డులపై భారం తగ్గే అవకాశం.. 

చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం వల్ల డంప్‌‌‌‌ యార్డుకు చేరే వ్యర్థాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. రీసైక్లింగ్‌‌‌‌, పునర్వినియోగం, కంపోస్టింగ్‌‌‌‌కు వెళ్లే వ్యర్థాల శాతం పోను మిగిలిన వ్యర్థాలను డంపింగ్​యార్డులో పారవేయొచ్చు. దీంతో డంపింగ్​యార్డులపై ఒత్తిడి తగ్గడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలంటే ప్రజల భాగస్వామ్యం కీలకం కానున్నది. ఇంటి నుంచే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించేలా ప్రజలను చైతన్యపరచాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలతో పాటు ఫీల్డ్​లెవెల్​లో పర్యవేక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
 
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే.. 
నాలుగు డస్ట్‌‌‌‌బిన్ల విధానాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దశలవారీగా అమలు చేసేందుకు అధికారులు ప్లాన్​చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైన డస్ట్‌‌‌‌బిన్లు, సేకరణ వాహనాలు,  వ్యర్థాల తరలింపు, ప్రాసెసింగ్‌‌‌‌ కేంద్రాల కెపాసిటీ తదితర అంశాలపై కసరత్తు చేస్తున్నారు. నాలుగు చెత్త డబ్బాల విధానంపై ఇప్పటికే ఎంఎంసీ(మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్)లో అవగాహన కల్పిస్తున్నారు.