- ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించొద్దని బీజేపీ ఎస్సీ మోర్చా డిమాండ్
సైఫాబాద్, వెలుగు: ఎస్సీ కార్పొరేషన్ నిధులను దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి వినియోగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా చేపట్టిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మంగళవారం లక్డీకాపూల్‌లోని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా చేరుకొని ఆందోళనకు దిగారు.
కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులు గేటు పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్‌కు కేటాయించిన రూ.10 వేల కోట్ల నిధులను ప్రభుత్వం దారి మళ్లిస్తోందని విమర్శించారు. నిధుల వినియోగంపై స్పష్టత ఇచ్చేంత వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
