- కరీంనగర్ రైస్ మిల్లర్ల సంఘం మాజీ నేత కరుణాకర్ నిర్వాకం
- 307 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
కరీంనగర్, వెలుగు : రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, సన్న బియ్యంగా మార్చి బ్రాండెడ్ పేరుతో అమ్ముతున్న ముఠా గుట్టును కరీంనగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితుల నుంచి 307 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కరీంనగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ తొడుపునూరి కరుణాకర్ స్థానిక పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో హనుమాన్ ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్లు నడుపుతున్నాడు. ఆయన గుమస్తా కొమ్మళ్ల తిరుపతయ్య, అకౌంటెంట్ బోనాల సుమశ్రీ, సప్లయర్ కట్ట మురళీధర్, డ్రైవర్ మల్క తిరుపతితో కలిసి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసేవాడు.
ఇలా సేకరించిన బియ్యాన్ని తన మిల్లులో పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చి బీపీటీ, హెచ్ఎంటీ, నంబర్ 1 కర్నూల్, టమాటో గోల్డ్, జేఎస్ఆర్, జైశ్రీరాం, కిసాన్, రాజాగోల్డ్, డబుల్ హౌస్, అన్నపూర్ణ లాంటి బ్రాండెడ్ కంపెనీల పేరుతో 25 కేజీల బస్తాల్లో నింపి అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల 350 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సేకరించి పాలిష్ చేసిన అనంతరం ప్యాక్ చేసి మార్కెట్ కు తరలించేందుకు సిద్ధం చేశారు. మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో పోలీసులు మిల్లుపై దాడి చేసి బియ్యంతో పాటు ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కరీంనగర్ టూటౌన్ సీఐ వెల్లడించారు.
