కరీంనగర్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో మంగళవారం కరీంనగర్కొత్త కలెక్టరేట్లో ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్, సెక్యూరిటీతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో మంత్రి పొన్నం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలన అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని తెలిపారు. కేటీఆర్ కు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్, డంపింగ్ యార్డ్, కరీంనగర్ రింగ్ రోడ్డు తదితర కీలక అంశాలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉన్నాయని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ ఆలం, కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ వెలిచాల రాజేందర్ రావు, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
