అందరి చూపు సిరిసిల్ల వైపు ..ఇవాళ (సెప్టెంబర్ 30)సీఎం హోదాలో తొలిసారి రేవంత్ పర్యటన

అందరి చూపు సిరిసిల్ల వైపు ..ఇవాళ (సెప్టెంబర్ 30)సీఎం హోదాలో తొలిసారి రేవంత్ పర్యటన
  • నేడు సీఎం హోదాలో తొలిసారి రేవంత్ పర్యటన
  • కరీంనగర్​లో కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్ ప్రారంభం
  • సిరిసిల్లలో రూ.345 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • నేతన్నల సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం 
  • గులాబీ పార్టీ నేతల భూకబ్జాలను ప్రస్తావించే చాన్స్ 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నారు. బీఆర్ఎస్ కంచుకోట, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వెళ్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం అందరి దృష్టి సిరిసిల్లపైనే పడింది. ముందుగా సీఎం బుధవారం సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్ భవనం ఆవరణలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్త కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. అనంతరం కలెక్టర్ చాంబర్‌‌‌‌‌‌‌‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను చైర్ లో కూర్చోబెడతారు. ఆ తర్వాత కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌‌‌‌‌‌‌‌లో జిల్లా సమగ్ర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సీఎం సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అర్బన్ చాలెంజ్ ఫండ్, అర్బన్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత సిరిసిల్లకు వెళ్తారు. 

సాయంత్రం సిరిసిల్లలో సభ.. 

సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి​సిరిసిల్ల చేరుకుని రూ.345 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పాదయాత్రగా బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. నేతన్నల సమస్యల పరిష్కారం, పాత బకాయిల చెల్లింపుతో పాటు చేనేత, పవర్‌‌‌‌‌‌‌‌లూమ్ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను ముఖ్యమంత్రి తన పర్యటన ద్వారా కల్పించనున్నారు. అలాగే, బీఆర్ఎస్ లీడర్ల భూకబ్జాలను సభలో ప్రస్తావించే అవకాశముందని తెలిసింది.

బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన ఏం మాట్లాడుతారనే విషయమై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ టార్గెట్ గా సభ లో సీఎం ప్రసంగం ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతలు 8 వేల ఎకరాల భూములు అక్రమంగా పట్టా చేసుకున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితోపాటు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన నేరేళ్ల ఘటన, ఇసుక దోపిడీ, మిడ్ మానేరులో జరిగిన అక్రమాలను ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. అలాగే, సిరిసిల్లతోపాటు వేములవాడలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పెద్దూరులో 18 ఎకరాల్లో ప్రతిపాదించిన ఈ స్కూల్ లో 5 నుంచి 12వ తరగతి వరకు 2,600 మంది విద్యార్థులకు వసతి కల్పించేలా 64 క్లాస్ రూమ్ లు, డార్మెటరీలు, స్పోర్ట్స్ గ్రౌండ్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. సిరిసిల్ల సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు గత నాలుగు రోజులుగా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. 
 
సీఎం సిరిసిల్ల సభను సక్సెస్ చేయాలి
    పార్టీ క్యాడర్ కు పీసీసీ చీఫ్ పిలుపు

హైదరాబాద్, వెలుగు: సిరిసిల్లలో బుధవారం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభకు పార్టీ శ్రేణలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల పర్యటనలో సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. సిరిసిల్లతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. జ్ఞానేశ్  కుమార్ రాజీనామా చేయాలంటూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు పీసీసీ చీఫ్ కృతజ్ఞతలు తెలిపారు.