సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపు కోసం నిర్వహించిన డ్రా ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. 58 ఇండ్లను డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించేందుకు అధికారులు చర్యలు చేపట్టగా, కేటాయింపుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మద్దిరాల గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 58 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం రెండేండ్ల కింద అప్లికేషన్లు తీసుకున్నారు.
58 ఇండ్లకు 500 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. 300 మందికి పైగా అర్హులుగా గుర్తించారు. ఈ ప్రక్రియ రెండేండ్లుగా పెండింగ్లో ఉండగా, దరఖాస్తు చేసుకున్న వారిలో కొంత మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. అయితే ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారికి సైతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రావడంతో డ్రా ప్రక్రియపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన ఓ మహిళ పెట్రోల్ బాటిల్ తో వచ్చి ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మరి కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపుపై విచారణ జరిపి అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
