- మధిర సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నుంచి సప్లై
- ఖమ్మం జిల్లాలోని 11 మండలాల్లోని 27,700 మంది విద్యార్థులకు రోజూ బ్రేక్ ఫాస్ట్
ఖమ్మం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్కూల్ బ్రేక్ ఫాస్ట్’ ప్రోగ్రామ్‌లో భాగంగా ఖమ్మం జిల్లా మధిరలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ విజయవంతంగా రెండు నెలల రన్‌ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జూలై 27న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించిన ఈ బృహత్తర కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా మధిరతో పాటు సమీపంలోని 11 మండలాల్లో ఉన్న 575 ప్రభుత్వ స్కూళ్లు,10 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారు 27,700 మంది విద్యార్థులకు రోజువారీగా రుచికరమైన, శుభ్రమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి అవసరమైన పోషకాలు అందించేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నేతృత్వంలో ప్రత్యేక అల్పాహార పట్టికను రూపొందించారు. ప్రతిరోజూ వైవిధ్యమైన ఆహారంతో పాటు రోజు విడిచి రోజు వేడి పాలను అందిస్తున్నారు. వారంలో మొదటి రోజు ఇడ్లీ - సాంబార్, రెండో రోజు పూరి ఆలూ కుర్మా, మూడో రోజు దోశ చట్నీ, నాల్గో రోజు ఉప్మా చట్నీ, ఐదో రోజు మిల్లెట్ ఇడ్లీ సాంబార్, ఆరో రోజు బోండా చట్నీ అందిస్తున్నారు.
అత్యాధునిక వంటశాల.. స్పీడ్‌గా సప్లై
వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులకు నిర్ణీత సమయానికి వేడివేడిగా అల్పాహారం అందించేందుకు కిచెన్‌లో ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. గంటకు 5,400 ఇడ్లీలు, 3,600 పూరీలు, 2,000 దోశలు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన అత్యాధునిక వంటశాల కలిగి, ఆధునిక పరిశుభ్రతా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేసిన బ్రేక్ ఫాస్ట్‌ను ప్రత్యేక వాహనాల ద్వారా సకాలంలో స్కూళ్లు, కాలేజీలకు చేరవేస్తున్నారు. ఉదయాన్నే పోషకాహారం అందడం వల్ల విద్యార్థులు ఖాళీ కడుపుతో తరగతుల్లో కూర్చోవాల్సిన అవసరం తప్పిందని, దీనివల్ల వారి ఏకాగ్రతతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం మెరుగవుతోందని నిర్వాహకులు తెలిపారు. ఈ వంటశాల నిర్మాణానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఆర్థిక సాయం అందించిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విద్యార్థుల స్థాయిని బట్టి బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు ఇలా..
ప్రైమరీ స్కూల్(1-5 తరగతులు): రూ. 11.50 (ప్రతి విద్యార్థికి)
హైస్కూల్ (6- 10 తరగతులు): రూ. 13.50 (ప్రతి విద్యార్థికి)
జూనియర్ కాలేజీ: రూ. 13.50 (ప్రతి విద్యార్థికి)
పాలు (రోజు విడిచి రోజు): విద్యార్థికి రూ. 1.08
