హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్.. స్కూటీని ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన టిప్పర్.. యువకుడు మృతి

హైదరాబాద్ లో మరో  హిట్ అండ్ రన్.. స్కూటీని ఢీ కొట్టి ఆపకుండా వెళ్లిన టిప్పర్.. యువకుడు మృతి

 

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓయూ–ఇఫ్లూ సమీపంలో స్కూటీపై వెళ్తున్న యువకుడిని టిప్పర్ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నామాలగుండు ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల హర్ష స్కూటీపై వెళ్తుండగా ఇఫ్లూ సమీపంలో టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్ష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఓయూ పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు, డ్రైవర్ ఆచూకీపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.