- తెల్లారి నుంచి అర్ధరాత్రి దాకా నడుస్తున్న దుకాణాలు
- షాపుల నిర్వహణకు గ్రామ పెద్దల సమక్షంలో వేలం
- మద్యం మత్తులో మునిగిపోతున్న యువత
- చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న ఆఫీసర్లు
2026 ఆగస్టు 18న కలెక్టర్ ఖుష్బు గుప్తా మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామంలో పర్యటించారు. ఈ సమయంలో బెల్ట్ షాపులకు లిక్కర్ తరలిస్తున్న వాహనాన్ని గుర్తించారు. అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్లు తేలడంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి, వాహనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఎక్సైజ్ ఆఫీసర్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ నెల 19న మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో మండల సభను నిర్వహించగా, ఆ మండలానికి చెందిన అన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు, మండల సర్పంచులు హాజరయ్యారు. సమావేశంలో బెల్ట్ షాపుల నిర్వహణపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయని, మద్యానికి యువత బానిస అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ యథేచ్చగా నడుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల మద్యం మత్తులో జరుగుతున్న ఘర్షణలే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సంబంధిత శాఖ మాత్రం బెల్ట్ షాపులను కట్టడి చేయడంలో విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి.
ఎప్పుడు తలుపు తట్టినా లిక్కర్
ఒకప్పుడు బెల్ట్ షాపులంటే రహస్యంగా నడిచేవి. ఈ దుకాణాలు అక్రమం కావడంతో తెలిసిన వారికి, చుట్టు పక్కల గ్రామాల్లో పరిచయం ఉన్న వ్యక్తులకే నిర్వాహకులు లిక్కర్ అమ్మేవారు. కొత్త వారు అడిగితే.. ‘ఇది కిరాణ షాపు. ఇక్కడ లిక్కర్ దొరకదు’ అని చెప్పి పంపించేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఊరికో బెల్టు షాపు పోయి, గల్లీ గల్లీకో బెల్ట్ షాపు వెలుస్తోంది. పైగా కొన్ని గ్రామాల్లో ఆ గ్రామానికి చెందిన పెద్ద మనుషులు ప్రభుత్వాలు మారిన సందర్భాల్లో, లేదా ఏడాదికి ఒకసారి బెల్ట్ షాపుల నిర్వహణ కోసం ఏకంగా వేలం నిర్వహిస్తున్నారు.
గ్రామభివృద్ధి పేరిట బెల్ట్ షాపు నిర్వహణకు వేలం నిర్వహించి రూ.లక్షల రూపాయలు నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నారు. ఇదే అదునుగా నిర్వాహకులు షాపులను తెల్లవారుజామున ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో తెలిసిన వ్యక్తులు వస్తే అర్ధరాత్రి ఒంటి గంట, రెండు గంటలకు కూడా తలుపు తడితే మద్యం ఇస్తుండడం గమనార్హం.
వైన్ షాపుల నుంచే అధిక ధరకు విక్రయం
వైన్ షాపుల నుంచి బెల్ట్ షాపులకు పెద్ద మొత్తంలో లిక్కర్ తరలుతోంది. కొద్దిరోజుల కిందటి వరకు బెల్టు షాపు నిర్వాహకులే వైన్స్‌ల వద్దకు వచ్చి మద్యాన్ని ఆటోల్లో తీసుకెళ్లేవారు. ఇప్పుడు వైన్స్ షాపుల నిర్వాహకులే ఆ మండలంలోని బెల్ట్ షాపులకు ప్రత్యేకంగా ట్రాలీ వాహనాల్లో లిక్కర్‌ను సప్లై చేస్తున్నారు. ఆయా గ్రామాలకు సమీపంలోని వైన్ షాపుల నిర్వాహకులతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒప్పందాలు చేసుకుంటున్నారు.
ప్రతి క్వార్టర్ సీసా, బీర్ల మీద ఉన్న ఎమ్మార్పీకంటే వైన్స్‌ల నిర్వాహకులకు అదనంగా రూ.10 వరకు చెల్లిస్తున్నారు. అనంతరం బెల్ట్ షాపుల్లో ఎమ్మార్పీ మీద రూ.20 నుంచి రూ.30 వరకు ఆయా కంపెనీల బ్రాండ్లను బట్టి అమ్ముతున్నారు. అయితే వైన్స్ షాపులకు ఎమ్మార్పీ ధరకంటే అదనంగా ఇస్తున్న డబ్బును కొందరికి ముట్టజెప్తునట్లు తెలిసింది. దందా సజావుగా సాగేందుకు వారికి ప్రతినెలా పెద్ద మొత్తంలో ముడుపులు అందిస్తున్నట్లు సమాచారం.
బానిసలుగా మారుతున్న యువత
సందు చివరనే బెల్ట్ షాపులు వెలుస్తుండడంతో గ్రామీణ యువత గాడి తప్పుతోంది. బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారు బడులు, కాలేజీలకు వెళ్తున్న పిల్లలకు కూడా అమ్ముతుండడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. మద్యానికి అలవాటైన యువకులు మందు కొనడానికి డబ్బుల్లేక అప్పులు సైతం చేస్తున్నారు. దొంగతనాలకూ పాల్పడుతున్నారు. తాగిన మైకంలో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, చుట్టు పక్కల వారిపై దాడులు కూడా చేస్తున్నారు. మద్యం మత్తులో బైకులు, కార్లు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
