గువాహటి: మయన్మార్ సరిహద్దు వెంబడి ఉన్న అరుణాచల్ ప్రదేశ్, చంగ్లాంగ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భద్రతా దళాల్లో కీలక విభాగమైన అస్సాం రైఫిల్స్ బృందాలపై తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక జవాన్ వీరమరణం పొందగా, మరో నలుగురు సైనికులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం 6.30 గంటలకు 21 జవాన్లు నాంపోంగ్ నల్లా ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం మయన్మార్ సరిహద్దుల్లో ఉండడంతో ఇక్కడ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలో తిరుగుబాటుదారులు ఒక్కసారిగా సైనిక దళాలపై మెరుపు దాడిచేశారు. కాల్పుల్లో హవిల్దార్ జంఖోకాయ్ కుకి (42) అనే జవాన్ మృతిచెందారు. మరో నలుగురు సైనికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక మిలిటరీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు భారీస్థాయిలో మోహరించాయి. సెక్యూరిటీని కట్టుదిట్టం చేసి తిరుగుబాటుదారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రాథమిక అంచనా ప్రకారం ఎన్ఎస్సీఎన్ (కే-–వైఏ) అనే మిలిటెంట్గ్రూప్ ఈ కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తిరుగుబాటుదారుల కదలికల కారణంగా చాంగ్లాంగ్ ప్రాంతం ఎప్పుడూ అత్యంత సమస్యాత్మకంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
