న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ బలోపేతం, కార్యాచరణపై రాష్ట్ర కీలక నేతలకు పార్టీ చీఫ్ నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు ఇంచార్జ్ సునీల్ బన్సల్ కూడా పార్టీ నేతలకు స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీస్‌లో పార్టీ నూతన ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లతో నితిన్ నబీన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణకు చెందిన తమిళనాడు సహ ఇంచార్జ్ డీకే అరుణ, కర్నాటక సహ ఇంచార్జ్ కాసం వెంకటేశ్వర్లు కూడా ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. మూడు సెషన్లుగా, దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ మీటింగ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలు, అన్ని వర్గాలలో పార్టీని బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బూత్ స్థాయి సంస్థాగత సమావేశాలు, క్షేత్రస్థాయి అభిప్రాయాలు అధిష్టానానికి చేరవేయాలని దిశానిర్దేశం చేసినట్టు పేర్కొన్నాయి.
అలాగే, నబీన్‌తో భేటీ అనంతరం డీకే అరుణ, కాసం వెంకటేశ్వర్లు, తెలంగాణకు చెందిన ఇతర నేతలు పలువురు పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ బన్సల్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దసరా తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెడుతున్నట్లు ఈ సందర్భంగా బన్సల్ చెప్పినట్లు తెలిసింది. అక్టోబర్ 4, 5 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తానని ఆయన చెప్పినట్టు సమాచారం. కాగా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీకి రావొద్దని ఇంచార్జ్, సహ ఇంచార్జ్‌లు, నేతలకు పార్టీ చీఫ్ నబీన్ గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఢిల్లీకి తరచూ రావడం కంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపైనే దృష్టి పెట్టాలని స్పష్టం చేసినట్టు సమాచారం. బాధ్యతలు అప్పగించిన రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా పర్యటించి పార్టీని విస్తరించాలని.. ఆయా రాష్ట్రాల్లో వారి ఎదుగుదల అంశాలను పార్టీ చూసుకుంటుందని హామీ ఇచ్చినట్టు తెలిసింది.
