మహిళల భద్రతపై యువత గళం విప్పాలి: రాహుల్ గాంధీ

మహిళల భద్రతపై యువత గళం విప్పాలి: రాహుల్ గాంధీ
  • బాధితులనే నిందించే పద్ధతి మారాలన్న ప్రతిపక్ష నేత
  • జెన్‌‌‌‌-జీ పెద్ద సంఖ్యలో నిరసనల్లోకి రావాలని పిలుపు

న్యూఢిల్లీ: మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా జెన్‌‌‌‌-జీ యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో శాంతియుత నిరసనల్లో పాల్గొనాలని కోరారు. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడే ప్రభుత్వం స్పందిస్తుందని ఆయన అన్నారు. ఈమేరకు మంగళవారం ఎక్స్‌‌‌‌లో పోస్టుతో పాటు వీడియోను కూడా రాహుల్ విడుదల చేశారు. 

మహిళలపై నేరాలు జరిగినప్పుడు వారిని ఇంటికే పరిమితం చేయడం పరిష్కారం కాదని తెలిపారు. దేశంలో మహిళలు రోడ్లపై నడవాలన్నా వేధింపులు, అత్యాచారాల భయంతో ఉంటున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలను ‘ఇండ్లలోనే ఉండండి’ అనడం పితృస్వామ్య భావజాలానికి నిదర్శనమన్నారు. నేరం చేసిన వారిని కాపాడి, బాధితులనే నిందించే విధానం, వ్యవస్థ మారాలని అన్నారు. మహిళలు స్వేచ్ఛగా తిరిగేలా వీధులను సురక్షితంగా మార్చాలని, నేరస్థులపై వేగంగా, ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వేలాది మంది రోడ్లపైకి

మహిళల భద్రత కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు, యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారని రాహుల్ చెప్పారు. ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన తర్వాత విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరింతమంది యువతులు, ముఖ్యంగా జెన్‌‌‌‌-జీ మహిళలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో చేరాలని ఆయన కోరారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని, తాను ఆందోళన చేస్తున్న వారికి అండగా ఉంటానని చెప్పారు.