- రూ.1,635 కోట్ల విలువైన ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రారంభించిన అమిత్ షా
- మొత్తం రూ.1,951 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం
న్యూఢిల్లీ:
ఢిల్లీలో రూ.1,635 కోట్ల వ్యయంతో నిర్మించిన బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్‌ను మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రారంభించారు. ఢిల్లీలో మొత్తం రూ.1,951 కోట్ల విలువైన నాలుగు ప్రధాన రహదారుల ప్రాజెక్టులను అమిత్‌షా ప్రారంభించారు. వీటిలో చాలా కాలంగా ఆలస్యమైన బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్, ముకర్బా చౌక్ అండర్‌పాస్ కూడా ఉన్నాయి. అలాగే, మోదీ మిల్ ఫ్లైఓవర్ పొడిగింపు, లోని అండర్‌పాస్ పనులను కూడా హోంమంత్రి ప్రారంభించారు.
5 కిలోమీటర్ల పొడవైన బరపుల్లా ఫేజ్–3 కారిడార్.. మయూర్ విహార్ ఫేజ్ I, సరాయ్ కాలే ఖాన్ మధ్య సిగ్నల్- ఫ్రీ మార్గాన్ని అందిస్తుంది. ఎయిమ్స్, దక్షిణ ఢిల్లీకి కూడా కనెక్టివిటీని కల్పిస్తుంది. ఇది సరాయ్ కాలే ఖాన్ వద్ద ఇప్పటికే ఉన్న బారాపుల్లా కారిడార్‌తో కలుస్తుంది. దీంతో మొత్తం ఎలివేటెడ్ మార్గం పొడవు సుమారు 9 కిలోమీటర్లకు చేరుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక సైకిల్ ట్రాక్, పాదచారుల మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఢిల్లీలోని రవాణా, ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం సంయుక్తంగా వేగంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఏండ్ల తరబడి నిలిచిపోయిన ఈ కీలక ప్రాజెక్టును వేగవంతం చేసి చివరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గడంతో పాటు, కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ నుంచి ఢిల్లీవాసులకు పెద్ద ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
