న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో 2024లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ముల్లా అఫ్రోజ్ అనే వ్యక్తిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద విధించిన ముందస్తు నిర్బంధాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. అఫ్రోజ్‌ను అక్రమంగా నిర్బంధించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షల జరిమానా విధించింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు బెంచ్ మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో నిందితుడు ఇచ్చిన ఒప్పుకోలు వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఎన్‌ఎస్‌ఏ కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడం చెల్లదని బెంచ్ స్పష్టం చేసింది.
