బలూచిస్తాన్ రెబెల్స్ మెరుపు దాడి.. 9 మంది పాక్ సైనికులు మృతి

బలూచిస్తాన్ రెబెల్స్ మెరుపు దాడి.. 9 మంది పాక్ సైనికులు మృతి
  • టర్బాట్‌‌‌‌ వద్ద పాక్ ఆర్మీ కాన్వాయ్‌‌‌‌పై మహిళా బృందం దాడి

ఇస్లామాబాద్/క్వెట్టా: బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కి చెందిన తొలి మహిళా సాయుధ దళం 'కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్' (కేఏఏడీ) జరిపిన మెరుపు దాడిలో 9 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోను ఆ సంస్థ విడుదల చేసింది. సెప్టెంబర్ 22న బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లోని చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపీఈసీ) హైవేపై టర్బాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

ముగ్గురు సభ్యుల క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (క్యూఆర్ఎఫ్) కాన్వాయ్‌‌‌‌పై మహిళా ఫైటర్లు రైఫిల్స్‌‌‌‌తో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఒక సాయుధ వాహనంతో సహా పలు పాక్ సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. మహిళా ఫైటర్లు కేవలం ఐదు అడుగుల దూరం నుంచే ఎదురుకాల్పులు జరిపారు. వీరికి 'ఖుర్బాన్' యూనిట్ సహకరించింది.

'మరి ఎనర్జీస్ లిమిటెడ్' సైట్‌‌‌‌పై దాడి..

బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ (బీఆర్ఏ) దేరా బగ్టిలోని బెహ్ లోటి ప్రాంతంలో ఉన్న 'మరి ఎనర్జీస్ లిమిటెడ్' సైట్‌‌‌‌పై రాకెట్లు, భారీ ఆయుధాలతో దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు కంపెనీ ఉద్యోగులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పాక్ బలగాలు, స్థానిక ప్రభుత్వ అనుకూల సాయుధ బృందాల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో మొత్తం 9 మంది పాక్ సైనికులు, ముగ్గురు సాయుధ బృందం సభ్యులు మృతి చెందారు. బీఆర్ఏ తరఫున ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.