- అఖిలపక్ష సదస్సులో నేతల డిమాండ్
బషీర్‌బాగ్, వెలుగు: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్క్ పేరుతో 23 ఏళ్లుగా నలుగుతున్న భూ సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట సమితి(జేఏసీ), తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సదస్సుకు ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. పరిహారం అందక ఇబ్బంది పడుతున్న రైతులు, ప్లాట్ల యజమానులకు తోడు, తాజాగా ఈ భూములను 22-ఏ నిషేధిత జాబితాలో చేర్చడం శోచనీయమన్నారు. ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ పార్క్ కోసం సేకరించిన 3 వేల ఎకరాల వినియోగం, మిగిలిన భూమి, లేఅవుట్ల వివరాలను టీజీఐఐసీ కమిషనర్ నుంచి సేకరిస్తామన్నారు. ఈ సమాచారంతో పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
కోదండరెడ్డి మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ సమస్య జటిలమైందని, కలెక్టర్ వేగంగా స్పందించాలని కోరారు. దసరా నాటికి ఈ సమస్యపై సానుకూల నిర్ణయం వచ్చేలా ప్రణాళికతో ముందడుగు వేస్తామని, వారం రోజుల్లో నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తామని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ, హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయవాది మాధవరం రామేశ్వరరావు, టీజేఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దార సత్యం, జేఏసీ కన్వీనర్ ముద్దం వెంకట్‌రెడ్డి, కో-కన్వీనర్ ఎం.వినయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
