పెట్రోల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో.. డీజిల్, ఏటీఎఫ్‌‌‌‌ పై ఎంతంటే

పెట్రోల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ జీరో.. డీజిల్, ఏటీఎఫ్‌‌‌‌ పై ఎంతంటే

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,  విమాన ఇంధనం (ఏటీఎఫ్‌‌‌‌) ఎగుమతులపై విధించే విండ్‌‌‌‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్  రేట్లు తగ్గాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే 15  రోజులకు ఈ సవరించిన  ధరలు వర్తిస్తాయి. పెట్రోల్ ఎగుమతులపై లీటరుకు రూ. 3.5గా ఉన్న సుంకాన్ని ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.  డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ.1.50 తగ్గించి రూ. 25.5 నుంచి రూ. 24కు తీసుకొచ్చింది.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్‌‌‌‌) ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 22 నుంచి  రూ. 19.5కు కుదించింది. ఇది లీటరుకు రూ. 2.50 తగ్గింపు.  దేశీయంగా వినియోగించే పెట్రోల్, డీజిల్‌‌‌‌పై ప్రస్తుతమున్న సుంకాల రేట్లు మారలేదు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా  పెరిగాయి. దీంతో లోకల్‌గా  ఇంధన కొరత రాకుండా సప్లయ్‌‌‌‌ పెంచడానికి ప్రభుత్వం ఈ ఏడాది మార్చి  నుంచి ఈ  సుంకాలను విధిస్తోంది.