- ఆమెతో పాటు మరో వ్యక్తి..
- ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ప్రమాదం
తాడ్వాయి, వెలుగు : కారును ఇసుక ఢీకొట్టడంతో వరంగల్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ తో పాటు ఆమె బంధువైన మరో వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కొండపర్తి క్రాస్సమీపంలో శనివారం జరిగింది. తాడ్వాయి ఎస్సై జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం..
వరంగల్ జిల్లా మార్కెటింగ్ఆఫీసర్ కలకొట్ల సురేఖ (38) శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంది. అనంతరం తన బంధువైన చింతా విజయబాబు (40)తో కలిసి కారులో ములుగు జిల్లా ఏటూరునాగారంలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. పస్రా, తాడ్వాయి మధ్యలో కొండపర్తి క్రాస్వద్దకు రాగానే ఇసుక లారీ ఢీకొట్టింది.
తీవ్రంగా గాయపడ్డ సురేఖ, విజయబాబు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఇద్దరు డెడ్ బాడీలు కారులోనే ఇరుక్కోవడంతో స్థానికుల సాయంతో బయటకు తీశారు. డీఎంఓ సురేఖ చెల్లెలు హారిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్ తెలిపారు. సురేఖ మృతి చెందడంతో పలువురు ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
రెండేండ్లలోనే కుమారుడు, భార్యాభర్త మృతి
వరంగల్ సిటీ, వెలుగు : ప్రమాదంలో చనిపోయిన వరంగల్ జిల్లా మార్కెటింగ్ ఆఫీసర్ సురేఖ కుటుంబాన్ని వరుస చావులు వెంటాడాయి. రెండేండ్లలోనే కుమారుడు, భార్యాభర్త చనిపోయారు. రెండేండ్ల కింద జరిగిన రోడ్డు ప్రమాదంలోనే సురేఖ కుమారుడు చనిపోగా, నాలుగు నెలల కింద ఆమె భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం జరిగిన ప్రమాదంలో సురేఖ సైతం మృత్యువాతపడడంతో కుటుంబంలో ఒక్కరు కూడా మిగలకుండా పోయారు.
