స్టేట్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం బ్యాంకులు బాంబే హైకోర్టులో కీలక అఫిడవిట్ దాఖలు చేశాయి. పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా నుంచి ఇంకా రూ.8వేల 752 కోట్లు బకాయిలు వసూలు కావాల్సి ఉందని బ్యాంకులు స్పష్టం చేశాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్ పూర్తిగా తీరిపోయాయంటూ మాల్యా చేసిన వాదనలను ఈ నివేదిక పూర్తిగా తోసిపుచ్చింది.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా, తనపై కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరుతూ 2020లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఆస్తుల రికవరీ ద్వారా బ్యాంక్ వివాదం సర్దుమణిగిందని.. తద్వారా తనపై చర్యలు ఆపాలని ఆయన వాదించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు SBI కన్సార్టియం తాజాగా సమర్పించిన వివరాలు ఈ వాదనలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి.
డెట్ రికవరీ ఆఫీసర్ ద్వారా బాండ్ అండర్‌టేకింగ్‌తో సుమారు రూ.10వేల 270 కోట్లు తాత్కాలికంగా రికవరీ అయ్యాయి. అలాగే డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో దావా వేయడానికి ముందు మరో రూ.544.58 కోట్లు రికవరీ చేయబడ్డాయి. అయితే వడ్డీలు, ఇతర పరిణామాల కారణంగా 2026 ఆగస్టు నాటికి అన్ని ఖర్చులు మినహాయించగా ఇంకా రూ.8వేల 752 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ ఉందని కన్సార్టియం కోర్టుకు వెల్లడించింది.
మరోవైపు ఈ కేసులో ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా తమ వైఖరిని స్పష్టం చేశాయి. సివిల్ రికవరీల ద్వారా నేరపూరిత బాధ్యతలు తొలగిపోవని ఈడీ పేర్కొంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం కింద ఆస్తుల పునరుద్ధరణ అనేది బాధితులకు న్యాయం చేయడానికి ఉద్దేశించినదే తప్ప, ఇది మనీలాండరింగ్ నేరాన్ని కొట్టివేయలేదని స్పష్టం చేసింది.
ప్రస్తుతం సివిల్ రికవరీ, క్రిమినల్ విచారణ అనే రెండు వేర్వేరు మార్గాల్లో ఈ న్యాయపోరాటం కొనసాగుతోంది. 2019లో మోస్ట్ వాంటెడ్, ఫ్యుజిటివ్ ఎకనామిక్ ఆఫెండర్‌గా ప్రకటించబడిన మాల్యా ప్రస్తుతం యూకేలో ఉంటున్నారు. ఈ హైప్రొఫైల్ కేసు తదుపరి విచారణను బాంబే హైకోర్టు అక్టోబర్ 13కి వాయిదా వేసింది. తాజా పరిణామంతో మాల్యాకు చట్టపరమైన చిక్కులు ఇప్పట్లో ముగిసేలా లేవు.
