వరంగల్, వెలుగు : వరంగల్ లోని మామునూర్ ఎయిర్‍పోర్టుకు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం డిమాండ్ చేసింది. హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్‍క్లబ్‍లో ఫోరం బాధ్యులు శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రలో తుపాకీ గుండ్లకు ఎదురు నిలిచిన దొడ్డి కొమురయ్య పేరును మామునూర్ ఎయిర్‍పోర్టుకు పెడితే అమరవీరులకు ఘనమైన నివాళులు ఇచ్చినట్లు భావిస్తామన్నారు.
ఈ క్రమంలో ప్రజల కోసం ప్రాణాలిచ్చిన కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ వంటి ఉద్యమవీరుల పేర్లు పెట్టాలి తప్పితే.. ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి రాజరికపు, భూస్వామ్య దోపిడీ ముద్రలున్నవారి పేర్లు తెలంగాణ నిర్మాణాలకు అవసరం లేదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓ సమావేశంలో మాట్లాడిన క్రమంలో దొడ్డి కొమురయ్య సేవలు భావితరాలకు తెలిసేలా చేస్తామన్నారని.. ఇప్పుడు విమానాశ్రాయానికి ఆయన పేరు పెట్టడం ద్వారా మాట నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే బహుజనుల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. సమావేశంలో ఫోరం బాధ్యులు దామెర రవీందర్, ఆజాద్, రాంబాబు, ఐలయ్య, మహేశ్ పాల్గొన్నారు.
