తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మటేడు గ్రామంలోని శ్రీవేంకటేశ్వర బిన్నీ రైస్ మిల్లులో ప్రభుత్వ ధాన్యం నిల్వలపై విజిలెన్స్, సివిల్ సప్లయ్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. 2022–23కి సంబంధించిన రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన రూ.2,47,09,098 విలువైన 1,011.880 టన్నుల ప్రభుత్వ ధాన్యం అందుబాటులో లేదని అధికారులు నిర్ధారించారు.
ఈ వ్యవహారంపై టీజీఎస్‌సీఎస్‌సీఎల్ జిల్లా మేనేజర్ ఫిర్యాదు చేయగా.. శ్రీవేంకటేశ్వర బిన్నీ రైస్ మిల్లు ప్రొప్రైటర్ బొల్లం వెంకన్నతో పాటు బొల్లం కొమురెల్లి, మహంకాళి రమేశ్, తాటికొండ వెంకన్న, ఎక్కటి కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిశోర్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగానికి సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
