ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్ రేషన్ కార్డులు కీలకం : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఆరు గ్యారంటీల అమలులో స్మార్ట్ రేషన్ కార్డులు కీలకం : పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
  •     ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలైతయ్: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ 
  •     రాష్ట్రవ్యాప్తంగా కోటికిపైగా కొత్త కార్డుల పంపిణీ సంతోషమని వ్యాఖ్య

మంచిర్యాల/పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వ ఆరు గ్యారంటీలలో స్మార్ట్‌‌ రేషన్​ కార్డులు కీలకంగా మారనున్నాయని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ కార్డుల ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించడానికి తోడ్పడుతాయని అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్​లో జరిగిన స్మార్ట్​ రేషన్​ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్​రెడ్డి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా కోటికి పైగా స్మార్ట్‌‌ రేషన్‌‌ కార్డులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలలో ఇబ్బందులు ఉండకూడదనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. 

మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నామని తెలిపారు. పర్ఫార్మెన్స్​ గ్రేడింగ్​ ఇండెక్స్​ (పీజీఐ) ర్యాంకింగ్‌‌లో రెండో స్థానంలో, విద్యార్థుల నమోదులో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​ కుమార్​ దీపక్​తో పాటు అధికారులను ఎంపీ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్​ మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు క్యూఆర్ కోడ్‌‌ భద్రతతో స్మార్ట్‌‌ రేషన్‌‌ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్​సాగర్​రావు మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్​ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్టర్‌‌కుమార్ దీపక్​ మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా 40,456 రేషన్‌‌ కార్డులు జారీ చేశామని తెలిపారు. 

పెద్దపల్లిలో రైల్వేస్టేషన్​ పనుల పరిశీలన.. 

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అమృత్​ భారత్ స్కీం కింద చేపడుతున్న రైల్వేస్టేషన్​ రెనోవేషన్​ పనులను శనివారం ఎంపీ వంశీకృష్ణ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎంపీ తెలిపారు. రామగుండం, -మణుగూరు రైల్వే లైన్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు సమస్యలు, సౌకర్యాల కల్పనను పట్టించుకోలేదని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. రైల్వే, విద్య, మౌలిక వసతుల రంగాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.

కేంద్రం విద్యార్థుల భవిష్యత్​తో ఆడుకుంది

కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, నీట్​ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్​తో ఆడుకుందని ఎంపీ వంశీకృష్ణ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. అమిత్ షా.. ఆర్​ఎస్​ఎస్​ సిద్ధాంతాలను పాటిస్తున్నారని, అతని ఆదేశాలతోనే ఢిల్లీ జంతర్​ మంతర్​ వద్ద ధర్నా చేసిన నీట్​ విద్యార్థులపై లాఠీ చార్జి జరిగిందని ఎంపీ ఆరోపించారు. 

అంబేద్కర్ స్ఫూర్తితో విశాక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థు లకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేందుకు కేంద్రం కొత్త చట్టాలను తీసుకువస్తున్నదని, ఈ చట్టాలతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అన్యాయం జరుగుతుంద న్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్​ సజ్జాద్, తాడూరి శ్రీమాన్, అడ్డగుంట శ్రీనివాస్, ప్రశాంత్, సొసైటీ నిర్వాహకులు పాల్గొన్నారు.