- హ్యామ్ విధానంలో 18,472 కిలోమీటర్ల రోడ్లు డెవలప్
- ఇయ్యాల ములుగులో పైలాన్ ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- గ్రామాలకు తీరనున్న రవాణా కష్టాలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. దేశంలోనే తొలిసారిగా పల్లె రోడ్ల నిర్మాణానికి ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడల్’ (హ్యామ్) విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రోడ్లు లేని గ్రామం ఉండకూడదన్న లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పైలాన్ ను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నేతృత్వంలో ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సరికొత్త మోడల్‌పై ఇప్పటికే అసోం, కర్ణాటక, ఏపీ ప్రభుత్వాలతో పాటు పలు కేంద్ర సంస్థలు కూడా ఆసక్తి కనబరుస్తుండడం విశేషం.
తొలి దశలో 7,448 కిలోమీటర్లు
హ్యామ్ తొలి దశలో 7,448 కిలోమీటర్ల మేర 2,145 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రహదారి సౌకర్యం లేని 176 గ్రామ పంచాయతీలకు 934 కిలోమీటర్ల మేర కొత్త బీటీ రోడ్లు నిర్మించనున్నారు. ఇప్పటికే ఉన్న బీటీ రోడ్లలో 5,490 కిలోమీటర్ల మేర మరమ్మతులు చేపట్టనున్నారు. అధిక రద్దీ ఉన్న 1,024 కిలోమీటర్ల సింగిల్ లేన్ బీటీ రోడ్లను ఇంటర్మీడియట్ లేన్లుగా విస్తరించనున్నారు. ఈ పనులతో తొలి దశలోనే 3,036 గ్రామ పంచాయతీలకు మేలు జరగనుంది. ఈ పనుల ప్రారంభానికి ములుగు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సమీపంలో పైలాన్ నిర్మించారు.
మూడు దశల్లో 18,472 కిలోమీటర్లు
రాష్ట్రంలోని 18,472 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారులను మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో 7,448 కిలోమీటర్లు, రెండో దశలో 5,676 కిలోమీటర్లు, మూడో దశలో 5,348 కిలోమీటర్ల రహదారులను అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ కింద ఎంపిక చేసిన రహదారులు గ్రామ పంచాయతీలను మండల, జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధానితో అనుసంధానించేలా ప్రాధాన్యతా క్రమంలో ఎంపిక చేశారు.
రహదారి లేని గ్రామ పంచాయతీలకు అన్ని కాలాల్లో ఉపయోగపడే బీటీ రహదారులు, మట్టి రోడ్లను అభివృద్ధి చేయడం, ఇప్పటికే ఉన్న రహదారులను బలోపేతం చేయడం ద్వారా సమగ్ర గ్రామీణ రహదారి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.
హ్యామ్ విధానంలో నిర్మించిన రోడ్ల నిర్వహణ బాధ్యతను 15 ఏండ్ల పాటు కాంట్రాక్ట్ సంస్థే చూసుకోనుంది. నిర్మాణ వ్యయంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే, మిగిలిన 60 శాతాన్ని కన్సెషనర్ భరించనున్నారు. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లలో 30 వాయిదాలుగా చెల్లిస్తుంది. దీంతో రహదారుల నిర్మాణంతో పాటు దీర్ఘకాలిక నిర్వహణకు కూడా ప్రాధాన్యం లభిస్తుంది.
పల్లెలు బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది
గ్రామానికి రోడ్డు అంటే కేవలం ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు. అది పల్లెను బడితో, దవాఖానతో, మార్కెట్‌తో, ఉపాధితో కలిపే అభివృద్ధి బాట. రోడ్డు వేసి చేతులు దులుపుకోవడం కాకుండా, 15 ఏండ్ల పాటు నాణ్యతతో నిర్వహించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. తెలంగాణ అమలు చేస్తున్న ఈ హ్యామ్ విధానం దేశానికే దిక్సూచి కాబోతోంది.
సీతక్క, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
