జేఎన్‌యూ మాజీ స్కాలర్లు ఉమర్ ఖాలీద్, షర్జిల్ ఇమామ్‌లు దాఖలు చేసిన బెయిలు పిటీషన్లని ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఉపా (యూఏపీఏ) చట్టం కింద 2020లో ఈశాన్య ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో వారిద్దరూ నిందితులు. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ భట్‌లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా అభిప్రాయపడింది. ‘గుల్ఫిషా ఫాతిమా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుని తాము సవరించలేం’ అని చెప్పారు.
ఆ కేసులో సుప్రీంకోర్టు కొన్ని షరతులను విధించింది. మొదటిదాని ప్రకారం రక్షణలో సాక్షుల విచారణ పూర్తి అయ్యేవరకు లేదా ఒక సంవత్సర కాలంలో గడిచేవరకు ఏది ముందైతే అప్పటివరకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవడానికి వీల్లేదు. అంటే జనవరి 5, 2027 తరువాత వేసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, తీర్పులకు మేం కట్టుబడి ఉన్నామని న్యాయమూర్తులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
న్యాయ క్రమశిక్షణకి కట్టుబడి ఉన్న తాము సుప్రీంకోర్టు విధించిన షరతులను సవరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. గుల్ఫిషా ఉత్తర్వులలోని అంశాలను గమనిస్తే ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమామ్‌లు కేసు సహ నిందితుల కన్నా భిన్నంగా ఉంది. ఆరోపించిన కుట్రకు సైద్ధాంతిక సూత్రధారులు వారని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు ఢిల్లీ హైకోర్టు తమ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పేర్కొంది.
సుప్రీంకోర్టు ప్రత్యేకమైన పరిశీలనలు చేసినప్పటికీ వారు బెయిలు దరఖాస్తుని దాఖలు చేయడానికి కారణాలు మూడు అవి.. గుల్ఫిషా ఫాతిమా కేసుని సుప్రీంకోర్టు పున:పరిశీలించింది. సహ ముద్దాయిలైన తస్లీ అహమ్మద్, ఖాలీద్ షైఫీలకు సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు విచారణలో జాప్యం కారణంగా వారికి మధ్యంతర బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేసింది. అప్పటికి వారు గుల్ఫిషా కేసు ఉత్తర్వులను ప్రకటించి ఆరుమాసాలు గడిచాయి.
ఆ తీర్పుని సుప్రీంకోర్టు మరో ధర్మాసనం ప్రశ్నించింది. తస్లీమ్ అహ్మద్, ఖాలీద్ సైఫ్‌ల పాత్ర షర్జిల్, ఉమర్‌ల పాత్రకు భిన్నమైనదని అందుకని అహ్మద్, సైఫీల మధ్యంతర బెయిలు మంజూరుని ఆధారపడి దానితో సమానత్వం కోరలేరని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఖాలీద్, ఇమామ్‌లకు కోర్టు బెయిలుని నిరాకరించడం ఇది మూడోసారి. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. అయినా ఢిల్లీ హైకోర్టు వారు దాఖలు చేసుకున్న ఆ బెయిలు అప్పీళ్లని కొట్టివేసింది. సుప్రీంకోర్టు విధించిన షరతుల దృష్ట్యా ట్రయల్ కోర్టు నిర్ణయంలో తాము తప్పు పట్టలేమని బుధవారం ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
కేసు నేపథ్యం
ఖాలీద్ తన మూడో బెయిల్ పిటీషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేశారు. అదే ఉత్తర్వు ద్వారా తన బెయిలును తిరస్కరించడాన్ని ఇమామ్ కూడా సవాలు చేశారు. వీరిద్దరూ ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును ట్రయల్ కోర్టు జులై 4న తిరస్కరించింది. ఈ ఉత్తర్వులకి వ్యతిరేకంగా ‘ఉపా’ చట్టంలోని సె.21 ప్రకారం ఢిల్లీ హైకోర్టులో అప్పీళ్లని దాఖలు చేశారు. ఈ అప్పీళ్లను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ బెయిల్ నిరాకరించింది. వారిద్దరికీ బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అనుసరించడం తప్ప తమకు మరో మార్గం లేదని ట్రయల్ కోర్టు పేర్కొంది.
గుల్ఫిషా కేసుపై అభ్యంతరం
గుల్ఫిషా బెయిలు ఉత్తర్వులు తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని సమన్వయ ధర్మాసనం గుల్ఫిషా ఫాతిమా కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘ఉపా’ కేసు విచారణలోని జాప్యాన్ని గుర్తించి బెయిల్ మంజూరు చేయవచ్చని 2021వ సంవత్సరంలో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె.ఎ. నజీబ్ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పుని ఈ గుల్ఫిషా కేసులో సరిగ్గా అనుసరించలేదని పేర్కొంది.
అదేవిధంగా గత మే నెలలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఖాలీద్, షర్జిల్‌ల బెయిల్ పిటీషన్లని తిరస్కరిస్తూ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె.ఎ. నజీబ్ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన తీర్పుని అర్థంచేసుకునే విషయంలో వివిధ బెంచ్‌ల మధ్య ‘అభిప్రాయ భేదం’ ఉందని గమనించి ఆ విషయాన్ని విస్తృత బెంచ్‌కు నివేదించింది.
కె.ఎ నజీబ్ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం. గుల్ఫిషా కేసులో తీర్పుని చెప్పింది ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం. ఉమర్ ఖలీద్, షర్జీల్ బెయిలు దరఖాస్తులని డిస్మిస్ చేసిన ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టులు ‘న్యాయ క్రమశిక్షణ’ను పాటించాయని చెబుతున్నాయి. అవి పాటించినది గుల్ఫిషా కేసుని నజీబ్ కేసుని కాదు. ఇది వైచిత్రి.
ఉపాలో బెయిల్, ఈ నిబంధనకు ఏకైక మినహాయింపు
ఉపాలోని సె.438 (5) అనేది ఉగ్రవాద వ్యతిరేక చట్టాలలో అత్యంత కఠినమైన బెయిల్ నిబంధన. సాధారణ క్రిమినల్ చట్టాలకు ఈ చట్టానికి చాలా భేదం ఉంది. సాధారణ క్రిమినల్ కేసుల్లో బెయిలు అనేది హక్కు. జైలు అనేది మినహాయింపు. అదే సూత్రం వర్తిస్తుంది. కానీ సె.43 డి (5)లో అది విరుద్ధం. ఇక్కడ జైలే ప్రాథమిక నియమం. బెయిలు అనేది మినహాయింపు మాత్రమే.
పోలీసులు సమర్పించిన ఎఫ్ఐఆర్‌ని కేసు డైరీని, చార్జిని పరిశీలించిన తరువాత నిందితుడిపై మోపిన ఆరోపణలను ప్రథమ దృష్టితో నిజమని కోర్టు భావిస్తే కోర్టు ఆ నిందితుడికి బెయిలు ఇవ్వదు. సాధారణ క్రిమినల్ కేసుల్లో నిందితుడిపై నేరాన్ని పోలీసులు కోర్టులో రుజువు చేసేవరకు నిందితుడు నిర్దోషిగానే పరిగణిస్తారు. కానీ
ఉపా చట్టంలో సె.43 డి (5) ప్రకారం పోలీసులు మోపిన ఆధారాలు తప్పు అని లేదా కేవలం అబద్ధపు ఆరోపణలను బెయిలు విచారణ దశలోనే చూపించాల్సిన బాధ్యత నిందితుడిపై ఉంటుంది. అదేవిధంగా బెయిల్ మీద ఉన్నప్పుడు తిరిగి అలాంటి నేరాలు చేయడన్న విశ్వాసాన్ని కోర్టులకి కలిగించాలి.
ఇవి రెండూ నిరూపణ చేయడం ఆ దశలో నిందితుడికి దుస్సాధ్యం. అందుకని జైల్లో నిందితుడు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నిబంధన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు విరుద్ధం. ఉపా చట్టంలోని సె.43 డి (5) ఎంత కఠినంగా ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కె.ఎ నజీబ్ కేసులో ఒక ఉపశమనాన్ని ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సత్వర విచారణ పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది.
ఒకవేళ ఆ విచారణ ప్రారంభం కాకుండా నిందితుడు సుదీర్ఘకాలం జైల్లోనే ఉండాల్సి వస్తే ఆ కారణంతో రాజ్యాంగ కోర్టులైన సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఆ సె.43డి (5)లోని ఆంక్షలను పక్కనపెట్టి బెయిలు మంజూరు చేయవచ్చు.
- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)
