బీ అలర్ట్: మా పిల్లలు అలా కాదులే అనుకుంటున్నారా..? గంజాయి మత్తు ఎలా చిత్తు చేస్తుందో తెలిస్తే నిద్ర పట్టదు!

 బీ అలర్ట్: మా పిల్లలు అలా కాదులే అనుకుంటున్నారా..? గంజాయి మత్తు ఎలా చిత్తు చేస్తుందో తెలిస్తే నిద్ర పట్టదు!

మీ పిల్లల ప్రవర్తన ఎలాంటిది.. వారి అలవాట్లు ఏంటి..? ఏదైనా మత్తకు బానిస అవుతున్నారా.. ఎప్పుడైనా గమనించారా..? అంటే ఏ పేరెంట్ అయినా ఏం చెప్తారు.. మా వాడు అలాంటి వాడు కాదు.. మా పిల్లలు అందరిలా కాదు అంటుంటారు కదా. పేరెంట్స్ అలా అంటున్నారంటే పిల్లల కదలికలను వారు గమనించనట్లే. కానీ ఇప్పుడు బాల్యాన్ని, కౌమార దశలో ఉన్న పిల్లలను గంజాయి మత్తు చిత్తు చేస్తున్న నిజం ఇప్పటికైనా తెలుసుకుంటేమంచింది. చాపకింద నీరులా పాకుతున్న గంజాయి మత్తుకు మీ ఇంటి వరకు వచ్చే వరకు మీకు తెలియదు. చేయి దాటి పోతే తెలిసినా లాభం లేదు. 

సిటీ నుంచి చిన్న పల్లె వరకు గంజాయి భూతం ఇప్పుడు పట్టి పీడిస్తుంది. ఇందులో పేదలు, పెద్దల పిల్లలు అని లేదు. ఎవరు ఎప్పుడు ఆ మత్తుకు బానిసలవుతారో చెప్పడం కష్టం.అయితే ప్రభుత్వాలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ విధిస్తున్నా.. గంజాయి పొగ మాత్రం అంతటా వ్యాపిస్తోంది. సిగరెట్, ఆల్కహాల్ నైనా మాన్పించగలం కానీ గంజాయి మత్తును మాన్పించలేం. అలాంటి మహమ్మారి బారిన పడే పిల్లల లక్షణాలు ఎలా ఉంటాయి.. ఒకవేళ మన ఇంటి వరకు వస్తే ఎంటి పరిష్కారం.. అనే అంశాలపై ప్రతీ పేరెంట్ ఒక అవగాహన కలిగి ఉండటం ఇప్పుడు అందరి బాధ్యత.

సిగరెట్ ఒక టీనేజర్ చేతిలో ఉంటేనే బాధపడే మనం చాలా సింపుల్ గా అతని చేతిలోకి వీడ్ (గంజాయి) దట్టించిన సిగరెట్ చేరుతోంది అని తెలుసుకుంటే మాత్రం కాస్త భయపడాల్సిందే. ఒక్కసారి మనం సేఫ్ గానే ఉన్నాం అన్న భ్రమల్లోంచి బయటికి వస్తే గంజాయి అనే మత్తు మందు పిల్లల చేతుల్లోకి కూడా వస్తోందన్న చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు.

డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా చైతన్యం కలిగిస్తున్నా మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి భూతం యువతను పట్టి పీడిస్తోంది. స్టూడెంట్లు జీవితాలను మత్తులో ముంచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అడవి ప్రాంతాలు, అంతర రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో గంజాయి మాఫియా బలంగానే ఉంది. మెట్రో పాలిటన్ సిటీస్ వరకే పరిమితమైందనుకు న్నడ్రగ్స్ మాఫియా ఇప్పుడు తన వికృత వ్యాపా రాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది. ఆ మాఫియానో, డ్రగ్స్ దందానో మనం ఆపలేం కానీ, మన పిల్లలని కాపాడుకోవటంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సింది మనమే.

నిర్లక్ష్యం వద్దు...

మనపిల్లలు అలా కాదులే అని నిర్లక్ష్యం వద్దు. అలా అని వాళ్లకి అర్థమయ్యేంతగ ఏదో నిఘా కూడా పెట్టొద్దు కానీ, పిల్లల ప్రవర్తనలో వచ్చే మార్పులని మాత్రం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని చెబుతున్నారు. చుట్టూ ఉన్న సొసైటీ ప్రభావం కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల కావచ్చు. 'ఒక్కసారి ట్రైచేసి చూద్దాం' అన్న సరదా కావచ్చు, వాళ్లలో ఉండే ఒత్తిడి కావచ్చు కారణం ఏదైనా పిల్లలు మాత్రం గంజాయి అమ్మే ముఠాలకు టార్గెట్ అవుతున్నారు. అందుకే పిల్లల్లో వచ్చే చిన్న మార్పులని గమనిస్తూ ఉండాలి. మామూలుగా ఇలాంటి అలవాట్లలో ఉన్న టీనేజర్లని వాళ్ల బిహేవియర్ లో వచ్చిన కొన్ని
మార్పులని బట్టి తెలుసుకోవచ్చు...

ఎలా మానిపించాలి?

నిజానికి చాలామంది టీనేజర్స్, జాబ్స్ లో ఉన్న వ్యక్తులూ అది చెడ్డ అలవాటు అన్న అవగాహనతోనే ఉంటారు. లోపల మానేయాలని ఉన్నా ఎలా మానేయాలో అర్థం కాని స్థితిలో ఉండిపోతారు. అందుకే అలాంటి లక్షణాలని గమనిస్తే వాళ్లమీద అరవటం, కోప్పడటం కాకుండా ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. మత్తు పదార్థాలకి బానిస కావటం అనేది కూడా ఒక మానసిక సమస్య అని అర్థం చేసుకోవాలి. వాళ్లని నేరస్తులుగా కాకుండా బాధితులుగానే చూడాలి. గంజాయి, కొకైన్ వంటి మత్తుపదార్థాలను సైకో ట్రోఫిక్ డ్రగ్స్ అని పిలుస్తారు. వీటి వాడకంతో మైండ్ లో ఒక రకమైన కిక్ వస్తుంది. బ్రెయిన్ పై ఈ డ్రగ్స్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. వీడ్ కి అలవాటు పడ్డ వారు త్వరగా మానుకోలేరు. అలవాటుగా మారితే సిగరెట్, ఆల్క హాల్ లాగా చిట్కాలతో మానిపించడం సాధ్యం కాని పని అని దాక్టర్లు చెప్తున్న మాట. కౌన్సెలింగ్ సెంటర్ కి తీసుకుపోవటం తప్ప ఇప్పటికైతే ఇంకో మార్గం లేదు.

ఇలా తెలుసుకోవచ్చు

  • వీడ్ (గంజాయి)తో సాధారణంగా ఈ అలవాటు మొదలవుతుంది. దీనికి అలవాటు పడ్డవాళ్ల కళ్లు కాస్త ఎరుపురంగులో కనిపిస్తూ ఉంటాయి.
  •  ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు.
  • గంటల తరబడి ఒంటరిగా ఉండడం, ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవటం ఉంటుంది.
  •  ఏ పనిలోనూ యాక్టివ్ గా ఉండరు.
  •  మాట్లాడే మాటలలో తేడాగా, కాస్తంత తడబడుతూ ఉంటారు. శుభ్రతను ఎక్కువగా పట్టించుకోక మాసిన దుస్తులతో తిరుగుతుంటారు.
  •  ఉన్నట్టుండీ ఖర్చులు పెరిగిపోతాయి. డబ్బులు కోసం పదేపదే అడుగుతుంటారు తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తుంటారు. ఏదో ఒక అబద్దం చెప్పి ఎలాగైనా ఇప్పటికిప్పుడు డబ్బు కావాలి అన్నట్టు ప్రవర్తిస్తారు.
  •  అనవసరంగా కోపం తెచ్చుకుంటూ అసహనంగా ఉంటారు. రెగ్యులర్ గా ఇంటికి లేట్ గా రావటం, వచ్చిన వెంటనే ఎవ్వరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్ళి నిద్రపోవటం చేస్తారు.
  •  ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేస్తారు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెప్తారు.

-నరేష్ కుమార్ సూఫీ