వణక్కం జెన్ జీ.. విజయ్ కి త్రిష సెల్యూట్.. వీడియో వైరల్

వణక్కం జెన్ జీ.. విజయ్ కి త్రిష సెల్యూట్.. వీడియో వైరల్
  •     తొలిసారి సీఎం హోదాలో జెండా ఎగురవేసిన విజయ్
  •     జెన్ జీకి ‘వణక్కం’తో ప్రసంగం ప్రారంభం
  •     విజయ్​కి త్రిష సెల్యూట్.. వీడియో వైరల్
  •     ఆయన తల్లిదండ్రులతో కలిసి ముందు వరుసలో త్రిష

చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ తన తొలి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జెన్ జీ యువతకు ప్రత్యేకంగా ‘వణక్కం’ చెప్పారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిపి పనిచేస్తామని, రాష్ట్ర హక్కులను కాపాడేందుకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన, పాత సంక్షేమ పథకాల కొనసాగింపుతోపాటు పలు కొత్త పథకాలను ప్రకటించారు. వేడుకల్లో నటి త్రిష విజయ్​కు సెల్యూట్ చేయడం, ఆయన తల్లిదండ్రులతో కలిసి ముందు వరుసలో కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శనివారం ఫోర్ట్ సెయింట్ జార్జ్‌‌‌‌‌‌‌‌ కోటలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎంగా విజయ్ తొలిసారి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ బంధువులు, జెన్ జీ స్నేహితులకు ‘వణక్కం’ అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన సమరయోధులకు నివాళులర్పించారు. కుల, మత భేదాలు తొలగి ప్రజలంతా ఒక్కటైనప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుందన్నారు. పరిపాలనలో కేంద్రానికి సహకరిస్తామని, కానీ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించే విధానాలను వ్యతిరేకిస్తామని చెప్పారు. అవినీతి నిర్మూలనే నిజమైన స్వాతంత్ర్యమన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రైవేట్ వ్యక్తులకు వెళ్లకుండా అడ్డుకున్నామని, అన్ని శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు, కుట్రలను తిప్పికొడతామని హెచ్చరించారు.

పాత పథకాలు కంటిన్యూ.. కొత్తగా వరాలు

ప్రజలకు ఉపయోగపడుతున్న గత ప్రభుత్వాల పథకాలను కొనసాగిస్తామని విజయ్ చెప్పారు. అన్నాడీఎంకే హయాంలోని అమ్మ క్యాంటీన్లు, డీఎంకే ప్రారంభించిన పాఠశాల విద్యార్థుల అల్పాహార పథకం కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే పంట రుణాలు మాఫీ చేశామని, 717 టాస్మాక్ మద్యం దుకాణాలను మూసివేశామని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు ఉంగరాలు ఇచ్చే ‘తైమామన్ తంగ మోదిరం’ పథకాన్ని రూ.755.83 కోట్లతో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. మాజీ సైనికుల కుమార్తెల పెళ్లి సాయాన్ని రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. దివ్యాంగ మాజీ సైనికులు, వారి కుటుంబాల నెలవారీ సాయాన్ని రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెంచారు. స్వాతంత్ర్య సమరయోధుల పింఛన్​ను రూ.23 వేలకు, వారి కుటుంబ సభ్యుల పింఛన్​ను రూ.12,500కు పెంచుతున్నట్లు తెలిపారు.

విజయ్‌‌‌‌‌‌‌‌ తల్లిదండ్రులతో త్రిష

స్వాతంత్ర్య దిన వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్ పోలీసుల గౌరవవందనం స్వీకరిస్తుండగా ఆమె సెల్యూట్ చేశారు. దీనికి విజయ్ చిరునవ్వు చిందించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభాతో కలిసి త్రిష ముందు వరుసలో కూర్చున్నారు. ఆమె తన తల్లి ఉమా కృష్ణన్‌‌‌‌‌‌‌‌తో కలిసి కార్యక్రమానికి వచ్చారు. గోల్డ్ టోన్ చీర, తక్కువ ఆభరణాలతో సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.