- విదేశీ ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే 60 శాతం ట్యాక్స్ కట్టాల్సిందే
న్యూఢిల్లీ: విదేశాల్లో ఆస్తులు ఉన్న చిన్న పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఊరనిచ్చింది. ఇలాంటి వారిపై "నల్లధనం చట్టం" కింద కేసులు, జైలు శిక్షలు పడకుండా ‘ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్‌పేయర్స్ డిస్‌క్లోజర్ స్కీమ్’ ను తీసుకొచ్చింది. చాలామంది విదేశాల్లో ఉద్యోగం చేసినప్పుడు అక్కడ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, షేర్లు లేదా ఇల్లు కొనడం చేస్తుంటారు. భారత్‌కు తిరిగి వచ్చాక లేదా ఇక్కడే ఉంటూ విదేశాల్లో పెట్టుబడులు పెట్టినప్పుడు ఆ వివరాలను ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్)లో చూపించడం మర్చిపోతుంటారు లేదా తెలియక దాచిపెడతారు. ఇలాంటి వారు తమ తప్పును సరిదిద్దుకునేందుకు ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.
రెండు కేటగిరీలుగా విభజన
ఒకటో విభాగం : ఒక వ్యక్తి వ్యాపారం లేదా వృత్తి ద్వారా డబ్బు సంపాదించారు. ఉదాహరణకు విదేశీ క్లయింట్ల నుంచి వచ్చిన ఫ్రీలాన్స్ ఆదాయం, విదేశీ కన్సల్టెన్సీ ఫీజు, లేదా స్థానిక ఆదాయం. కానీ ఆ ఆదాయాన్ని భారత ప్రభుత్వానికి చూపించకుండా (ట్యాక్స్ కట్టకుండా), విదేశీ బ్యాంకు అకౌంట్లలో ఉంచారు లేదా ఆ డబ్బుతో షేర్లు, ఆస్తులు కొన్నారు. ఇది ఆదాయపు పన్ను లేదా బ్లాక్ మనీ చట్టం ప్రకారం నేరం (సివిల్ లేదా ట్యాక్స్ ఉల్లంఘన). దీనికి 60శాతం పన్ను కట్టి ఈ స్కీమ్ కింద సెటిల్ చేసుకోవచ్చు. మిగిలిన 40 శాతం వైట్ అవుతుంది. ఈ కేటగిరీలో గరిష్టంగా రూ. కోటి వరకు ఉన్న విదేశీ ఆదాయం లేదా ఆస్తులకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. అక్రమ కార్యకలాపాలు, నేరాల ద్వారా చేసే మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ఆస్తులు కొన్నవారికి, కేటగిరీ–1 పన్ను చెల్లింపుదారులకు మధ్య తేడా ఉంటుంది.
రెండో విభాగం: పన్ను చెల్లింపుదారుడు గతంలో విదేశాల్లో (ఎన్‌ఆర్‌ఐగా) ఉన్నప్పుడు లీగల్‌గా సంపాదించి కొన్న ఆస్తులు, లేదా పన్ను కట్టిన డబ్బుతోనే కొన్నప్పటికీ ఇండియా వచ్చాక ఫారమ్స్‌లో డిక్లేర్ చేయడం మర్చిపోయినవి. గరిష్టంగా రూ. ఐదు కోట్ల వరకు ఉన్న ఇటువంటి ఆస్తులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. చిన్న ఆస్తులైతే పెనాల్టీ, ట్యాక్స్ పడదు. కాస్త పెద్దవైతే కేవలం రూ. లక్ష ఫీజు కడితే చాలని ఐటీ శాఖ తెలిపింది.
