ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లాల్ బహాదుర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో కలకలం రేగింది. ఎయిరిండియా విమానంలో ముంబై వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి తుపాకి అనుకోకుండా పేలడంతో ఇద్దరు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది గాయపడ్డారు.
అజంగఢ్‌కు చెందిన ఒక ప్రయాణికుడు తన భార్యతో కలిసి ముంబై వెళ్లేందుకు ఎయిరిండియా ఫ్లైట్ (IX-1810) ఎక్కాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఆయన తన వద్ద ఉన్న లైసెన్స్ గన్‌ను బోర్డింగ్‌కు ముందే అధికారులకు డిక్లేర్ చేశారు.
అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గన్ మిస్ ఫైర్ అయింది. ముందుగా నేలను తాకిన ఆ బుల్లెట్ శకలాలు అక్కడే విధుల్లో ఉన్న ఇద్దరు ఏఏఐసీఎల్‌ఏఎస్ స్క్రీనర్‌లకు తగిలాయి. ఈ ఘటనలో ఒక మహిళా సిబ్బంది తొడ భాగంలోనూ, మరొకరికి చేతికి గాయాలయ్యాయి.
►ALSO READ | పాన్ మసాలా యాడ్ వివాదం..బాలీవుడ్ స్టార్ హీరోలకు నోటీసులు
వెంటనే అప్రమత్తమైన సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు విమానాశ్రయానికి చేరుకుని, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక సెక్యూరిటీ వైఫల్యమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
