హైదరాబాద్‌లో కల్తీ సోన్‌పాపిడి తయారీ.. రూ. 4 లక్షల సరుకు సీజ్

హైదరాబాద్‌లో కల్తీ సోన్‌పాపిడి తయారీ.. రూ. 4 లక్షల సరుకు సీజ్

హైదరాబాద్ శివారులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ కేటుగాళ్ల గుట్టు రట్టయింది. గడువు ముగిసిన ముడిసరుకులతో ప్రమాదకర రీతిలో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ఓ తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

బొంగుళూర్‌లోని 'కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్'లో ఎటువంటి నిబంధనలు పాటించకుండా అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో సోన్‌పాపిడి, పల్లి పట్టీ చిక్కీలను తయారు చేస్తున్నారు. అంతేకాదు, గడువు ముగిసిన ముడిసరుకులు, ఎలాంటి లేబుల్స్ లేని ఫ్లేవర్లు, కెమికల్స్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, హెచ్-ఫాస్ట్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏకంగా 1,560 జార్ల సోన్‌పాపిడి, 670 కిలోల లేబుల్ లేని బెల్లం, 72 బస్తాల గడువు ముగిసిన మైదా పిండిని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం సరుకు విలువ రూ. 4.07 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.

ఈ దారుణానికి పాల్పడిన KSM ఫుడ్ ప్రొడక్ట్స్ యజమాని మహ్మద్ ఖాలీద్‌తో పాటు మేనేజర్ సంతోష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు హెచ్చరిస్తున్నారు.