మంచిర్యాల గిరిజన రైతులకు మంత్రి వివేక్‌ భరోసా.. శాశ్వత పరిష్కారానికి హామీ

మంచిర్యాల గిరిజన రైతులకు మంత్రి వివేక్‌ భరోసా.. శాశ్వత పరిష్కారానికి హామీ

మంచిర్యాల జిల్లా: కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాంలో గిరిజనులపై దాడి ఘటనపై రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఆరా తీశారు. అటవీ అధికారుల దాడిలో గాయపడిన గిరిజనులను మంత్రి స్వయంగా కలిసి పరామర్శించారు. బాధితుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న అటవీ భూముల్లో పట్టు పురుగుల సాగు (సెరికల్చర్‌) చేసుకుంటున్నామని, అయితే ఫారెస్ట్‌ సిబ్బంది తమ సాగును అడ్డుకుంటున్నారని గిరిజన రైతులు మంత్రికి వివరించారు. పట్టు సాగుపై ఆధారపడి జీవిస్తున్న తమపై అటవీ అధికారులు కర్కశంగా వ్యవహరించారని, దాడులకు పాల్పడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.పోడు భూములు, పట్టు సాగుపై ఆధారపడుతున్న గిరిజన రైతుల సమస్యలను మంత్రి వివేక్‌ వెంకటస్వామి దృష్టికి తీసుకున్నారు. బాధితుల సమస్యలను విన్న మంత్రి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

గిరిజన రైతుల సమస్యపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని మంత్రి తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు.పోడు భూములు, సెరికల్చర్‌ సాగుపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి పరిష్కారం కోసం కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.