గాంధీ జయంతి నాడే వన్డే వరల్డ్ కప్ షురూ.. 2027పై ఐసీసీ మాస్టర్ ప్లాన్!

 గాంధీ జయంతి నాడే వన్డే వరల్డ్ కప్ షురూ.. 2027పై ఐసీసీ మాస్టర్ ప్లాన్!

ODI World Cup 2027: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోయే 2027 ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ను అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు చేస్తోంది. మహాత్మా గాంధీ 158వ జయంతిని పురస్కరించుకుని ఆ రోజే ఈ మెగా టోర్నీకి శ్రీకారం చుట్టాలని ఐసీసీ చూస్తోంది. భారత్‌లో స్వాతంత్ర్య పోరాటంతో పాటు దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన 21 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి, ఆయన సిద్ధాంతాలకు నివాళిగా ఈ చారిత్రక రోజును సెలక్ట్ చేసినట్లు సమాచారం. 

షెడ్యూల్‌లో మార్పులు.. నవంబర్ 21న ఫైనల్:  

గతంలో ప్రతిపాదించిన ప్లాన్ ప్రకారం అక్టోబర్ 1 నుంచి 7 వరకు వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించి, అక్టోబర్ 8న వరల్డ్ కప్ ప్రారంభించాలని ఐసీసీ భావించింది. కానీ గాంధీ జయంతి రోజున టోర్నీ ప్రారంభించాలనే ఉద్దేశంతో వార్మప్ మ్యాచ్‌లను సెప్టెంబర్ చివరి వారానికే తరలించి, అక్టోబర్ 2న ప్రధాన మ్యాచ్‌లను ప్రారంభించనున్నారు. దాదాపు 50 రోజుల పాటు సాగే ఈ 14 జట్ల మెగా సమరం నవంబర్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. ఐసీసీ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో 8, జింబాబ్వేలో 3, నమీబియాలో 1తో కలిపి మొత్తం 12 వేదికలను ఖరారు చేసింది. 

కొత్త ఫార్మాట్.. సూపర్ సిరీస్ రౌండ్: 

ఈసారి 2027 ప్రపంచకప్ ఫార్మాట్‌లో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో తక్కువ ర్యాంకింగ్ కలిగిన 3 జట్లు ముందుగా సూపర్ సిరీస్ పేరిట ముక్కోణపు సిరీస్ ఆడాల్సి ఉంటుంది. అందులో విజేతగా నిలిచిన జట్టు మిగిలిన 11 జట్లతో కలిసి 12 జట్ల ప్రధాన గ్రూప్ దశలోకి అడుగు పెడుతుంది. ఈ 12 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్కడి నుంచి టాప్ జట్లు సూపర్-7 దశకు, ఆ తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్‌కు చేరుకుంటాయి.

►ALSO READ | ఆసీస్ని చిత్తు చిత్తుగా ఓడించిన బంగ్లాదేశ్.. ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్ట్ విజయం

భారత్– దక్షిణాఫ్రికా చారిత్రక బంధం.. గాంధీజీకి ఘన నివాళి:  

మహాత్మా గాంధీ భారత స్వాతంత్ర్య సంగ్రామానికే కాకుండా దక్షిణాఫ్రికా సామాజిక, రాజకీయ మార్పులకు కూడా బలమైన పునాది వేశారు. క్రికెట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జట్లుగా వెలుగుందుతున్న భారత్, దక్షిణాఫ్రికాల మధ్య గాంధీజీ ఆలోచనలు ఒక చారిత్రక వారధిగా నిలిచాయి. ఆఫ్రికా ఖండంలో రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ అడుగు పెడుతున్న ఈ వన్డే ప్రపంచకప్‌ను గాంధీ పుట్టినరోజున ప్రారంభించడం ద్వారా ప్రపంచ క్రీడా వేదికపై శాంతి, సామరస్య సందేశాన్ని అందించవచ్చని ఐసీసీ విశ్వసిస్తోంది.