సిద్దిపేట రాజకీయాలపై తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కవిత ప్రత్యేక దృష్టి సారించారు. సిద్దిపేట నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారంపై ఆమె స్పష్టత ఇచ్చారు. సిద్దిపేట నుంచి పోటీ చేసే అంశంపై పార్టీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. భవిష్యత్‌లో పార్టీ తరఫున కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
సిద్దిపేట పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత పీఏ వెంకటనారాయణ తల్లి మృతి చెందడంతో కవిత ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి తన సానుభూతిని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆమె..రానున్న రోజుల్లో సిద్దిపేటలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్లు కవిత తెలిపారు. సిద్దిపేట పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో త్వరలో భారీ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కవిత తెలిపారు.
సిద్దిపేటలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ కార్యకలాపాలకు శాశ్వత కేంద్రంగా కార్యాలయాన్ని ఉపయోగించడంతో పాటు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు దీనిని కేంద్రంగా మార్చే అవకాశం ఉంది.
సిద్దిపేట ప్రస్తుతం రాజకీయంగా కీలక నియోజకవర్గంగా ఉంది. సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తరఫున తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
