హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న ఫ్లైఓవర్ పనుల ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. రూ.1వెయ్యి20 కోట్ల పనులకు సంబంధించిన సవరించిన స్కోప్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనుల పరిధిలో మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సవరించిన ప్రణాళికలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫకంజా కాలేజీ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్–1కు కనెక్టింగ్ ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ముగ్ధ జంక్షన్ పనుల పరిధిలోనూ మార్పులు చేశారు. రోడ్ నంబర్–45, ఫిల్మ్‌నగర్, మహారాజా అగ్రసేన్ జంక్షన్‌ల పనుల స్కోప్‌ను సవరించారు. క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ సమీపంలోని పనుల పరిధిలోనూ మార్పులు చేశారు.
మరోవైపు పంజాగుట్ట స్మశాన వాటిక, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్లలో ప్రతిపాదించిన గ్రేడ్ సెపరేటర్ పనులను రద్దు చేశారు. పంజాగుట్ట స్మశాన వాటిక జంక్షన్‌లో ప్రతిపాదించిన 3-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్‌ను, ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్‌లో ప్రతిపాదించిన 2-లేన్ యూని-డైరెక్షనల్ ఫ్లైఓవర్‌ను రద్దు చేశారు. బంజారాహిల్స్‌లో ప్రతిపాదించిన 2-లేన్ యూని-డైరెక్షనల్ అండర్‌పాస్ పనులను కూడా రద్దు చేశారు.
కేబీఆర్ పార్క్ పనుల కాంట్రాక్ట్‌లోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కాంట్రాక్టర్‌గా MEILకు పనులు అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో KNR కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన LOAను రద్దు చేసింది. టెండర్ సమయంలో KNR కన్‌స్ట్రక్షన్స్ చెల్లించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.
ప్యాకేజీ–1, ప్యాకేజీ–2 పనులను సవరించిన డిజైన్లతో ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేబీఆర్ పార్క్ పనుల కోసం సబ్‌స్టిట్యూటింగ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ల సేవలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
