న్యూఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను కలవాలంటూ ఢిల్లీలోని ఆకాశవాణి భవన్ ప్రాంగణంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నిరసన కొనసాగుతోంది. అక్టోబర్ 6 మధ్యాహ్నం 2 గంటల నుంచి రాహుల్ నిరసన కొనసాగుతోంది.
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్లు ప్రతిపక్ష ఎంపీలను కలవకపోవడం ద్వారా ప్రజల గొంతును అగౌరవపరిచారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు అడిగేందుకు ఎంపీలు ఎన్నికల సంఘాన్ని కలవాలని కోరుకుంటున్నారని తెలిపారు.ఎన్నికల ప్రక్రియలో ‘ఓట్ చోరీ’ జరిగిందన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష నేతలను ఎన్నికల కమిషనర్లు కలిసి వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరారు.మేం ఎన్నికల కమిషనర్లను కలవాలనుకుంటున్నాం. వారిని కలిసి ప్రశ్నలు అడగాలి. ఓట్ల దోపిడీ జరిగిందన్న మా ఆరోపణలపై వారు సమాధానం చెప్పాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఆకాశవాణి భవన్ ప్రాంగణంలో నిరసన కొనసాగించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ తెలిపారు. పోలీసులు అక్కడ నిరసనకు అభ్యంతరం వ్యక్తం చేస్తే, ప్రత్యామ్నాయంగా మరో ప్రదేశాన్ని సూచించాలని కోరారు.రాజ్యాంగం తమకు నిరసన తెలిపే హక్కును కల్పించిందని ఆయన అన్నారు. ఎన్నికల సంఘంతో సమావేశం జరిగే వరకు తమ డిమాండ్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈసీ పనితీరు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ మంగళవారం (అక్టోబర్ 6) సేమ్ డెమొక్రసీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయ ముట్టడికి విపక్షాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ మకర్ ద్వార్ నుంచి ఈసీ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు ర్యాలీగా బయలుదేరారు. ర్యాలీకి అనుమతి లేకపోవడంతో విపక్ష కూటమి ఎంపీలను జీఎస్టీ భవన్ దగ్గర బారికేడ్లు పెట్టి పోలీసులు అడ్డుకున్నారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తోన్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ఎంపీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ఎదుట.. నడి రోడ్డుపైనే కూర్చుని నిరసనకు దిగారు.
