రేపే ( ఆగస్టు17) నాగ పంచమి.. నాగదేవత పూజకు శుభ సమయం ఇదే..!

రేపే ( ఆగస్టు17) నాగ పంచమి.. నాగదేవత పూజకు శుభ సమయం ఇదే..!

శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి రోజున నాగ పంచమిని జరుపుకుంటారు.  ఈ ఏడాది (2026)  ఆగస్టు 17న నాగ పంచమి సందర్భంగా ఇంట్లో నాగదేవతను ఎలా పూజించాలి? పూజకు శుభ సమయం, సమర్పించాల్సిన నైవేద్యాలు సమర్పించాలి.. ఇంకా  నాగ పంచమి రోజు ఏ దేవుడిని పూజించాలి.. మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

శ్రావణ మాసంలో నాగ పంచమి రోజు నాగేంద్రుడిని పూజిస్తారు.  అలాగే ఈ నెల  శివ భగవానుడి ఆరాధనకు అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. పండితులు తెలిసిన వివరాల ప్రకారం ఆగస్టు 17 వ తేదీన ఈఏడాది  నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని, సర్ప భయం, వ్యాధులు, కాలసర్ప దోషం వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. 


నాగపంచమి పూజకు శుభ సమయం ఇదే..!

పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథిన నాగ పంచమిని జరుపుకుంటారు. 2026లో పంచమి తిథి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 4:52 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుంది. ఉదయ తిథిని పరిగణనలోకి తీసుకుని 2026 ఆగస్టు 17, సోమవారం నాగ పంచమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున నాగదేవతను పూజించడానికి ఉదయం 5:51 గంటల నుంచి 8:29 గంటల వరకు శుభ సమయమని పండితులు చెబుతున్నారు.

నాగ పంచమి పూజ ఎలా చేయాలి?

నాగ పంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి, తలస్నానం చేసి ఇంటిని, ముఖ్యంగా పూజా స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. అనంతరం పూజ కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి, దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరచాలి. ఆ పీఠంపై నాగదేవత చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు. ఇంట్లో నాగదేవత విగ్రహం లేకపోతే, చిత్రపటంతోనే పూజ చేసుకోవచ్చు. అనంతరం శివుడిని, నాగదేవతను మనసులో ధ్యానిస్తూ పూజ చేయడానికి సంకల్పం చేసుకోవాలి.

నాగదేవతకు ఏం నైవేద్యంగా సమర్పించాలి?

 నాగదేవతకు నీరు, పాలు, పువ్వులు, అక్షతలు, పసుపు, కుంకుమ, చందనం వంటి పూజా ద్రవ్యాలను సమర్పించవచ్చు. అనంతరం దీపం, అగరబత్తులు వెలిగించి భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలి. నాగదేవతకు పండ్లు, మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని ప్రాంతాల్లో నాగ పంచమి సందర్భంగా నాగదేవతకు ప్రతీకాత్మకంగా పాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది.  కొంతమంది దేవాలయం నాగేంద్రుని విగ్రహాలకు పాలు పోసి నైవేద్యాలు సమర్పిస్తారు. 

పూజ సమయంలో నాగదేవతను భక్తిశ్రద్ధలతో స్మరించాలి.  కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సుఖశాంతులు, ఐశ్వర్యం, శ్రేయస్సు కోసం ప్రార్థించాలి. పురాణాల  ప్రకారం, నాగ పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుంది.  

►ALSO READ | నాగపంచమి స్పెషల్.. నవ నాగులు అంటే ఎవరు? ఎందుకు పూజిస్తారు? విశిష్టత ఏమిటి?

పూజ పూర్తయిన తర్వాత నాగదేవతకు హారతి ఇచ్చి, కుటుంబ సభ్యులందరికీ ప్రసాదం పంచాలి. ఆర్థిక స్థోమతను బట్టి ఆ పేదలకు  రోజున అన్నదానం వస్త్రదానం  దానం చేయడం చాలా  శుభప్రదమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. నాగ పంచమి సందర్భంగా పాములను పట్టుకోవడం, వాటిని ఇబ్బంది పెట్టడం లేదా వాటికి నేరుగా పాలు పోయడం కాకుండా, నాగదేవతను ప్రతీకాత్మకంగా పూజించడం, ప్రకృతిలోని జీవులను గౌరవించాలి.

శివుడిని కూడా పూజించండి

నాగ పంచమికి శివుడితో ప్రత్యేక సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి.  శివుడి మెడలో నాగరాజు కొలువై ఉంటాడు. నాగపంచమమి రోజున  శివుడితో పాటు నాగదేవతను పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో శివలింగం ఉంటే, అభిషేకం చేసి పూజించవచ్చు. అనంతరం బిల్వపత్రాలు, పుష్పాలు, వంటి పూజా ద్రవ్యాలను సమర్పించి శివుడిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.