ఇరాన్ చేతుల్లో ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం : ఇదే జరిగితే ప్రపంచం అల్లకల్లోలమే..!

ఇరాన్ చేతుల్లో ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం : ఇదే జరిగితే ప్రపంచం అల్లకల్లోలమే..!

యుద్ధంలో ఇరాన్ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందా.. ఇప్పటి వరకు అణు బాంబులు ఉన్నాయనే కారణంగానే.. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. ఇప్పుడు ఇరాన్ దగ్గర అణు బాంబును మించిన ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రం ఉందని.. ఈ విషయంలో ఇరాన్ దూకుడుగా వ్యవహరిస్తే.. రెండు ఖండాలు అంటే.. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఇంటర్నెట్ బంద్ అవుతుందని ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఇప్పటి వరకు ఇరాన్ ఇంటర్నెట్ జోలికి వెళ్లలేదని.. ఇరాన్ దేశంపై దాడుల తీవ్రత పెరిగితే మాత్రం.. సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లు కట్ చేయటం ఖాయం అని.. అమెరికా దేశానికి చెందిన ఆర్థిక, నిఘా నిపుణులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడి పెట్టిన కంపెనీలు సైతం.. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న ఇంటర్నెట్ బ్రహ్మాస్త్రంపై వణికిపోతున్నారంట. ఈ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య సాగుతున్న యుద్ధం ఇప్పుడు మూడవ వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ పోరు కేవలం క్షిపణులు, బాంబులకే పరిమితం కాకుండా.. ప్రపంచాన్ని అతలాకుతలం చేసే డిజిటల్ యుద్ధం వైపు మళ్లుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటి 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధిని దిగ్బంధించింది. ఇప్పుడు అందరి దృష్టి సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై పడింది. టెహ్రాన్ తన నెక్స్ట్ ఈ గ్లోబల్ ఇంటర్నెట్‌ను కట్ చేయబోతోందా? అనే ప్రశ్న ప్రపంచ దేశాలను ఇప్పుడు వణికిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా మనం వాడుతున్న ఇంటర్నెట్ డేటాలో ఎక్కువ శాతం సముద్ర గర్భంలో మైళ్ల పొడవునా ఏర్పాటు చేసిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. ఎర్ర సముద్రం, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో దాదాపు 20కి పైగా అతిముఖ్యమైన సబ్‌సీ కేబుల్స్ ఉన్నాయి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను కలిపే ఈ కేబుల్స్.. వీడియో కాల్స్, ఈమెయిల్స్ నుంచి మొదలుకొని బ్యాంకింగ్ లావాదేవీలు, ఏఐ సేవల వరకు అన్నింటికీ కీలకమైనవి. హోర్ముజ్ జలసంధిలో కేవలం 200 అడుగుల లోతులోనే ఉండే ఈ కేబుల్స్, ఇరాన్ రక్షణ దళాలకు చాలా ఈజీ లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉంది.

►ALSO READ | దుబాయ్ హబ్‌కు ఆపిల్ గుడ్ బై? కొత్త రూట్లలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ల తరలింపు..

ఇప్పటికే ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తూ ఆ ప్రాంతాన్ని డేంజర్ జోన్‌గా మార్చేశారు. గతంలో హౌతీల దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిని ఆసియా, ఆఫ్రికాలో ఇంటర్నెట్ వేగం దారుణంగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు హోర్ముజ్, బాబ్ ఎల్-మందేబ్ వంటి కీలక మార్గాలు మూతపడటంతో.. ఒకవేళ కేబుల్స్ తెగితే వాటిని రిపేర్ చేయడం దాదాపు అసాధ్యమేనని తెలుస్తోంది. యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లోకి కేబుల్ రిపేర్ షిప్స్ వెళ్లడానికి ఇన్సూరెన్స్ కంపెనీలు, యజమానులు అంగీకరించరు. దీనివల్ల ఇంటర్నెట్ నెమ్మదించడం మాత్రమే కాక.. వారాల తరబడి డిజిటల్ వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. 

ఈ ముప్పు కేవలం గల్ఫ్ దేశాలకే పరిమితం కాదు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజాలు గల్ఫ్ దేశాల్లో నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లపై దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు విదేశీ డేటా కనెక్షన్ల కోసం ఈ మార్గమే కీలకం. ఒకవేళ ఇరాన్ కావాలని ఈ కేబుల్స్‌ను టార్గెట్ చేస్తే.. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. ఇదే జరిగితే క్రూడ్ వార్ కాస్తా.. 'డేటా యుద్ధం'గా మారి ప్రపంచం చీకట్లోకి వెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు నిపుణులు.