ప్రతి నెల మాదిరిగానే జూలై 1న కూడా అనేక రూల్స్ మారబోతున్నాయి. అందుకే ఇది ప్రజల జేబులకే కాదు ముఖ్యమైన పేపర్‌వర్క్‌కు కీలకమైన రోజుగా మారబోతోంది. ఆధార్ రూల్స్ మార్పుల నుండి గ్యాస్ సిలిండర్ ధరల సవరణల వరకు.. సామాన్యుడిపై ప్రభావం చూపే పలు కొత్త నియమ నిబంధనలు వచ్చే నెల మొదటి తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి. జూలై 1 నుండి మారబోతున్న ఆ ముఖ్యమైన అంశాల వివరాలను పరిశీలిద్దాం రండి..
ఉచితంగా ఆధార్ అప్‌డేట్:
ఆధార్ కార్డు వినియోగదారులకు UIDAI ఒక మంచి అవకాశాన్ని కల్పించింది. జూలై 1 నుండి డిసెంబర్ వరకు ఆధార్‌లో ఇమెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. దీంతో పాటు పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి డెమోగ్రాఫిక్ సమాచారాన్ని కూడా ఎటువంటి ఫీజులు లేకుండానే మార్చుకోవచ్చు. గతంలో దీని కోసం రూ.75 ఛార్జ్ వసూలు చేసేవారు.
రైల్వే నిబంధనలు కఠినం.. భారీ జరిమానాలు:
జూలై 1 నుంచి ఇండియన్ రైల్వేస్ రూల్స్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. జన్ విశ్వాస్ చట్టం సవరణల ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనీస జరిమానాను రూ.250 నుండి రూ.500 కి పెంచారు. మహిళల కోచ్‌లలో ప్రయాణించే పురుషులకు ఏకంగా రూ.2,500 వరకు జరిమానా పడవచ్చు. అలాగే ఇతరుల టికెట్లపై ప్రయాణించడం, జనరల్ టికెట్‌తో స్లీపర్ క్లాస్‌లో వెళ్లడం, రైళ్లలో అనధికారికంగా వస్తువులు అమ్మడం, మద్యం సేవించి గొడవ చేయడం వంటి పనులకు భారీ జరిమానాలు విధిస్తారు.
ఎల్‌పీజీ, సీఎన్‌జీ ధరల సవరణ:
ప్రతి నెల మొదటి తేదీలాగే.. జూలై 1న కూడా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సవరించనున్నాయి. అంతర్జాతీయ ఇంధన ధరల ఆధారంగా ఈ మార్పు ఉంటుంది. వీటితో పాటు సీఎన్‌జీ, పీఎన్‌జీ, విమానాల్లో వాడే ఏటీఎఫ్ ధరలు కూడా మారే అవకాశం ఉంది.
క్రెడిట్ కార్డ్ నియమాల్లో మార్పులు:
1. HDFC Bank: రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఉచిత డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందాలంటే.. మునుపటి క్వార్టర్లో కనీసం రూ.60వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
2. YES Bank: జూలై 1 నుండి ఉచిత లాంజ్ యాక్సెస్ కోసం క్వార్టర్లీ స్పెండింగ్ లిమిట్‌ను రూ.10వేల నుంచి రూ.35వేలకి పెంచారు.
3. HSBC: ప్రభుత్వ చెల్లింపులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, వాలెట్ లోడ్స్, ఇంధనం, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై ఇకపై రివార్డ్ పాయింట్లను నిలిపివేయనుంది.
4. Citi Bank: జూలై 15 లోగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు పూర్తిగా యాక్సిస్ బ్యాంక్ ప్లాట్‌ఫారమ్‌కు మైగ్రేట్ అవుతాయి. అయితే కార్డ్ నంబర్, పిన్, ఎక్స్‌పైరీ డేట్ మారవు.
టాక్స్ గడువులు:
జీతభత్యాలు పొందే ఉద్యోగులు, నాన్-ఆడిట్ కేసులకు సంబంధించి 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నుల(ITR-1, ITR-2) దాఖలుకు జూలై 31 చివరి తేదీ. అలాగే ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించిన టీడీఎస్ డిపాజిట్ చేయడానికి జూలై 7 ఆఖరి తేదీ. కాబట్టి ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవటం బెటర్.
