సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంగారెడ్డిలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి తనపై, బీఆర్ఎస్ పార్టీపై చేసిన అఘోర పూజల ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని విధంగా రేవంత్ రోత మాటలు, చిల్లర మాటలు మాట్లాడారని హరీష్ రావు దుయ్యబట్టారు. సింగూర్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతారని ఆశించి వస్తే, సీఎం కేవలం సొల్లు మాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు. సింగూర్‌ను ఖాళీ చేయించి సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో తాగునీటి కష్టాలు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆరోపించారు.
దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో మాట్లాడాలని సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని, కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, కేసీఆర్ రూ. 45 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. రూ. 16 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసి రేవంత్ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. దమ్ముంటే ఏ గ్రామానికైనా వద్దామని, అక్కడ రుణమాఫీ కాకపోతే తాను ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి రూ. 2500 ఏమయ్యాయని ప్రశ్నించిన హరీష్ రావు.. రేవంత్ ఒక ఘరానా దొంగ అని అభివర్ణించారు. అవినీతి గురించి ప్రశ్నిస్తే పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని, దమ్ముంటే అసెంబ్లీ పెట్టి ప్రజా సమస్యలపై చర్చిద్దామని డిమాండ్ చేశారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
