పిల్లలంటే సెలవుల్లో ఆటలు, అల్లరి, స్నేహితులతో సరదా.. కానీ కొందరు పిల్లలకు మాత్రం సమ్మర్ హాలిడేస్ కూడా స్కూల్‌లానే మారిపోయాయి. స్కూల్స్ తెరవకముందే వచ్చే ఏడాది సిలబస్ పూర్తి చేయాలి.. వివిధ లాంగ్వేజెస్, మ్యాథ్య్స్ నేర్చుకోవాలి.. అంటూ పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ అంటూ పిలుస్తున్నారు. ఫ్యా క్టరీలో ముందే తయారుచేసిన ‘ప్రీ-మేడ్ మీల్స్’తో పోలుస్తూ వచ్చిన ఈ పదం.. పిల్లలను చిన్న వయసులోనే భవిష్యత్తు పోటీకి సిద్ధం చేస్తున్న పేరెంట్స్ తీరుపై కొత్త చర్చకు తెరలేపింది.
సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ అనే కొత్త పదం వైరల్ అవుతోంది. వేసవి సెలవుల్లో పిల్లలకు ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి సమయం ఇవ్వకుండా.. వచ్చే ఏడాది లెసన్స్ కూడా ముందుగానే నేర్పిస్తూ, చదువులో ఇతర పిల్లల కంటే ముందుండేలా పేరెంట్స్ ప్రెజర్ చేయడాన్ని ఈ పదంతో పోలుస్తున్నారు.
‘ప్రీ-మేడ్ మీల్స్’ అంటే ఫ్యాక్టరీలో ముందుగానే తయారు చేసి, అవసరమైనప్పుడు వేడి చేసి తినే ఆహారం. చైనాలో ఇలాంటి ఆహారంపై పెద్దగా మంచి అభిప్రాయం లేదు. ఇదే భావన నుంచి ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ అనే పదం వచ్చింది. అంటే పిల్లలను కూడా ముందుగానే “తయారు చేసి”, భవిష్యత్తుకు సిద్ధం చేస్తున్నారనే వ్యంగ్య అర్థం అన్నమాట.
వేసవి సెలవుల్లో చిన్నాలను చైనీస్ పద్యాలు చదివించడం, ఇంగ్లిష్ పదాలు బట్టీ పట్టించడం, ఆన్‌లైన్ మ్యాథ్య్స్ క్లాసులకు పంపించడం చేస్తున్నారట. మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితిని చూస్తున్నాం.. స్కూల్స్ మొదలవకముందే పిల్లలను సిద్దం చేస్తున్నారట.
ఈ ధోరణిని చైనాలోని చికెన్ బ్లడ్ పేరెంటింగ్ అనే సంస్కృతితో కూడా ముడిపెడుతున్నారు. పిల్లలు పోటీలో వెనుకపడకూడదనే ఉద్దేశంతో పేరెంట్స్ వారిపై చదువు, శిక్షణ విషయంలో తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.
అయితే ఈ విధానం సరైనదేనా? అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. పిల్లలను చిన్న వయసులోనే భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం మంచిదే అయినా.. చదువుతో పాటు ఆట, విశ్రాంతి, స్నేహాలు, స్వేచ్ఛ కూడా బాల్యంలో ముఖ్యమే అంటున్నారు పలువురు. అందుకే ‘ప్రీ-మేడ్ చిల్డ్రన్’ అనే పదం ఇప్పుడు పిల్లలపై పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై పెద్ద చర్చకు దారితీస్తోంది.
